ఈ ఏడాదైనా పుస్తకాలు అందేనా!?

ABN , First Publish Date - 2023-06-07T01:01:16+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీపై ఈ ఏడాది కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాదైనా పుస్తకాలు అందేనా!?

ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం

ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఇప్పటివరకూ అందని పుస్తకాలు

గత ఏడాది కూడా చేతెలెత్తేసిన బోర్డు

అందుకే ఉత్తీర్ణతా శాతం పడిపోయిందంటున్న అధ్యాపకులు

విశాఖపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీపై ఈ ఏడాది కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఇంటర్‌ బోర్డు చేతులెత్తేసింది. ఇంకా చెప్పాలంటే 2020లో కరోనా ప్రారంభం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 2020-21, 2021-22లో పూర్తిగా పుస్తకాలు అందజేయలేకపోయారు. కరోనా పూర్తిగా తగ్గడంతో గత విద్యా సంవత్సరం (2022-23)లోనైనా పుస్తకాలు పంపిణీ చేస్తారని ఎదురుచూసిన విద్యార్థులకు నిరాశే మిగిలింది.

ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే ఇంటర్‌ విద్యార్థులకు అవసరమైన పుస్తకాల ముద్రణకు అయ్యే ఖర్చు చాలాకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం భరిస్తోంది. పాఠ్య పుస్తకాల ముద్రణను తెలుగు అకాడమీ చేపడుతుండగా నిధులు టీటీడీ ఇస్తుండేది. కానీ గత ఏడాది టీటీడీ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడం,ఇంటర్‌బోర్డు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థులకు పుస్తకాలు అందలేదు. నాడు-నేడు కింద వందల కోట్ల రూపాయలతో కళాశాలల్లో వసతులు కల్పిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం అతి ముఖ్యమైన పాఠ్య పుస్తకాల పంపిణీ గురించి పట్టించుకోకపోవడాన్ని పలువురు అధ్యాపకులు తప్పుబడుతున్నారు. గత నెల విడుదలైన ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం దారుణంగా పడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడం కూడా ఫలితాలపై ప్రభావం చూపుతుందని రిటైర్డు లెక్చరర్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. కళాశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయలేకపోవడం బోర్డు వైఫల్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం తరగతులు ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 38 జూనియర్‌ కళాశాలల్లో గత ఏడాది సుమారు 40 వేల మంది విద్యార్థులు చదువుకున్నారు. గత విద్యా సంవత్సరం ప్రథమ ఏడాది చదివిన విద్యార్థులు ప్రస్తుత ఏడాది ద్వితీయ సంవత్సరానికి వచ్చారు. ప్రథమ ఏడాది ప్రవేశాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు వరకు కొనసాగుతుంది. అయితే గడచిన కొన్ని సంవత్సరాల లెక్కలు తీసుకుంటే ప్రథమ సంవత్సరం సుమారు 20 వేల మంది వరకు చేరుతుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ గురించి జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఆర్‌.సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా ఇప్పటివరకు పుస్తకాలు జిల్లాకు రాలేదని, త్వరలో బోర్డు నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Updated Date - 2023-06-07T01:01:16+05:30 IST