ఎన్నటికి పూర్తయ్యేనో..!

ABN , First Publish Date - 2023-07-02T01:07:54+05:30 IST

ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో మూడేళ్ల క్రితం చేపట్టిన సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్‌ సెంటర్లు, డిజిటల్‌ గ్రంథాలయాల భవన నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అత్యధిక మంది కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులు ఆపేశారు.

ఎన్నటికి పూర్తయ్యేనో..!
నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో అసంపూర్తిగా గ్రామ సచివాలయ భవనం

జిల్లాలో పడకేసిన సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలు

మూడేళ్ల క్రితం పనులు ప్రారంభం

2,106 భవనాలకు ఇంతవరకు 180 మాత్రమే పూర్తి

డిజిటల్‌ లైబ్రరీలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లకు పునాదులే పడని పరిస్థితి

బిల్లులు ఇవ్వడం లేదంటూ పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు

ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వం హడావిడి

సెప్టెంబరులోగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్లకు ఆదేశాలు

పీఆర్‌ ఇంజనీర్ల ద్వారా పురమాయింపు

అయినాసరే ముందుకురాని కాంట్రాక్టర్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో మూడేళ్ల క్రితం చేపట్టిన సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్‌ సెంటర్లు, డిజిటల్‌ గ్రంథాలయాల భవన నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అత్యధిక మంది కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులు ఆపేశారు. మొత్తం 2,106 భవనాలకుగాను ఇంతవరకు 180 భవనాలు పూర్తయ్యాయి. ఇందుకు ప్రభుత్వ నిర్వాకమే కారణం కావడంతో భవన నిర్మాణ గడువును తరచూ పొడిగిస్తున్నది. అయినప్పటికీ ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించడంలేదు.

ఉమ్మడి విశాఖ జిల్లాగా వున్నప్పుడు ప్రస్తుత అనకాపల్లి జిల్లా పరిధిలో ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, డిజిటల్‌ గ్రంథాలయాలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు మూడేళ్ల క్రితం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.159.69 కోట్లతో 465 గ్రామ సచివాలయాలకు, రూ.97.71 కోట్లతో 448 రైతు భరోసా కేంద్రాలకు, రూ.60.68 కోట్లతో ఆరోగ్య సేవా కేంద్రాలకు, రూ.67.83 కోట్లతో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లకు, రూ.70.79 కోట్లతో డిజిటల్‌ లైబ్రరీలకు భవన నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 2,106 భవనాలకు రూ.446.7 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది స్థానిక నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి భవన నిర్మాణ పనులు చేపట్టారు. వాస్తవంగా ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలి. కానీ చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పనులు ఆపేశారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మొత్తం 2,106 భవనాలకుగాను ఇంతవరకు సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్‌ సెంటర్లకు సంబంధించి 180 భవనాలు పూర్తయ్యాయి. మరో 450 భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీల భవన నిర్మాణాలకు చాలాచోట్ల పునాదులే తీయలేదు. పూర్తి చేసిన భవనాలకు సంబంధించి సుమారు రూ.112 కోట్ల మేరకు బిల్లులు చెల్లించినట్టు తెలిసింది. మరోవైపు భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, పనులు పూర్తిచేస్తే ప్రభుత్వం బిల్లులు ఇస్తుందో, లేదో అన్న సందేహంతో పలువురు కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను కొనసాగించడానికి ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో కొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనుండంతో అసంపూర్తిగా వున్న భవన నిర్మాణ పనులను సెప్టెంబరు నెలాఖరునాటికి పూర్తి చేయించాలని ప్రభుత్వం తాజాగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి.. ఆయా భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజినీర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు కాంట్రాక్టర్లతో మాట్లాడి మధ్యలో నిలిపేసిన భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ పనుల్లో ఏ మాత్రం పురోగతి కనిపించడంలేదు. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే తప్ప పనులను పునఃప్రారంభించేది లేదని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు.

కాంట్రాక్టర్లకు నోటీసులిస్తాం..

వీరన్నాయుడు, ఈఈ, పీఆర్‌ ఇంజనీరింగ్‌

జిల్లాలో వివిధ దశల్లో ఆగిన సచివాలయాలు, ఆర్‌బీకేలు, ఆరోగ్య సేవా కేంద్రాల భవన నిర్మాణ పనులను పునఃప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు జరిగిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల కోసం ప్రతిపాదించాం. పనులు మధ్యలో నిలిపేసి, నిర్మాణ పనులు చేపట్టని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వివరణ కోరతాం.

Updated Date - 2023-07-02T01:07:54+05:30 IST