‘ఉక్కు’ సంకల్పమేదీ?
ABN , First Publish Date - 2023-03-03T01:34:37+05:30 IST
రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం రూ.100 కోట్లు వెచ్చించి రెండు నెలలుగా నానా పాట్లు పడుతున్న జగన్ ప్రభుత్వం.. కళ్ల ముందు రూ.3.5 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దివాలా తీస్తుంటే పట్టనట్టు ఉండడం ఏమిటని కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.
3.5 లక్షల కోట్ల ఫ్యాక్టరీని వదిలేసి.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఆత్రమా?
స్టీల్ ప్లాంటు కోసం కేంద్రంపై పోరాడరేం?
జగన్ సర్కారుకు ఉక్కు కార్మికుల సూటి ప్రశ్నలు
విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):
రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం రూ.100 కోట్లు వెచ్చించి రెండు నెలలుగా నానా పాట్లు పడుతున్న జగన్ ప్రభుత్వం.. కళ్ల ముందు రూ.3.5 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దివాలా తీస్తుంటే పట్టనట్టు ఉండడం ఏమిటని కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు సొంత గనులు ఇవ్వకుండా, వడ్డీ రేట్లు తగ్గించకుండా సహాయ నిరాకరణ చేస్తున్న కేంద్రంతో రాష్ట్ర పాలకులు ఎందుకు పోరాటం చేయరని కార్మిక నాయకులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. రూ.26 వేల కోట్ల అప్పులకే రూ.3.5 లక్షల కోట్ల విలువైన సంస్థను దివాలా తీసినట్టు ప్రకటిస్తారా? ఇది న్యాయమేనా? అని నిలదీస్తున్నారు. ఏ విధమైన సాయం అందకున్నా కార్మికులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, అందుకే తాజాగా సెయిల్‌తోపాటు విశాఖ ఉక్కుకు కూడా ఢిల్లీలో ఎక్స్‌లెన్స్ అవార్డు ఇచ్చారని గుర్తుచేస్తున్నారు.
50 వేల కోట్ల పన్నులు చెల్లించాం
కేవలం రూ.26 వేల కోట్లు సమకూరిస్తే, ఇంకో 12 మిలియన్ టన్నుల కర్మాగారం కూడా నిర్మించుకోవచ్చు. మరో 50 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. రూ.3.5 లక్షల కోట్ల ఆస్తి నిలుస్తుంది. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.50 వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లించాం. ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డాం.
-డి.ఆదినారాయణ, గుర్తింపు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి, విశాఖ ఉక్కు