ట్యాంక్‌ బండ్‌లా మారుస్తారనుకుంటే ఏమిటిలా?

ABN , First Publish Date - 2023-05-26T00:41:50+05:30 IST

నర్సీపట్నం పెద్ద చెరువు ప్రాంతాన్ని ట్యాంక్‌ బండ్‌ తరహాలో అభివృద్ధి చేస్తే చూడాలన్న ఈ ప్రాంతవాసుల ఆకాంక్ష నెరవేరలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులు ఆ తరువాత ముందుకు సాగలేదు. అందం గా తీర్చిదిద్దుతారనుకున్న పెద్ద చెరువు ప్రస్తుతం అధ్వానంగా దర్శన మిస్తోంది.

ట్యాంక్‌ బండ్‌లా మారుస్తారనుకుంటే ఏమిటిలా?
పెద్ద చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం

నర్సీపట్నం పెద్ద చెరువు అభివృద్ధికి టీడీపీ హయాంలో శ్రీకారం

రూ.5.7 కోట్ల నిధులు మంజూరు

కొంత మేర పనులు పూర్తి

వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రేక్‌

అధ్వానంగా తయారైన పరిసరాలు

పట్టించుకోని మునిసిపల్‌ అధికారులు

నర్సీపట్నం, మే 25 : నర్సీపట్నం పెద్ద చెరువు ప్రాంతాన్ని ట్యాంక్‌ బండ్‌ తరహాలో అభివృద్ధి చేస్తే చూడాలన్న ఈ ప్రాంతవాసుల ఆకాంక్ష నెరవేరలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులు ఆ తరువాత ముందుకు సాగలేదు. అందం గా తీర్చిదిద్దుతారనుకున్న పెద్ద చెరువు ప్రస్తుతం అధ్వానంగా దర్శన మిస్తోంది.

నర్సీపట్నం పెద్ద చెరువును ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేయడానికి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంతో కృషి చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి స్టేట్‌ హైవే ప్లాన్‌ నుంచి ఆర్‌ అండ్‌ బీ శాఖ రూ.5.7 కోట్ల నిధులు మంజూరు చేయించారు. పర్యాటక శాఖ నుంచి మరో రూ.95 లక్షల నిధులు మంజూరు చేయించారు. 2018లో డిసెంబరులో ట్యాంక్‌ బండ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2.4 కోట్లు ఖర్చు చేసి చెరువు గట్టుకు కాంక్రీట్‌ వాల్‌, మరో వైపు రాతి కట్టు, తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇంకా చెరువు గట్టు మీద వాకింగ్‌ ట్రాక్‌, స్టీల్‌ రెయిలింగ్‌, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన రూ.90 లక్షలు నిధులతో జాతీయ నాయకులు, స్వాత్రంత్య్ర సమర యోధుల విగ్రహాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంతలో 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మిగిలిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ రూ.1.72 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులతో పెద్ద చెరువు వద్ద పార్కు అభివృద్ధి చేస్తామని రెండేళ్ల క్రితం ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ట్యాంక్‌ బండ్‌ అభివృద్ధి చేస్తే పార్కు, బోట్‌ షికారు, చిన్నపిల్లల ఆట వస్తువులు, వాకింగ్‌ ట్రాక్‌ వంటి సౌకర్యాలు సమకూరతాయని ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు.

పెద్ద చెరువు ప్రాంతంలో అపారిశుధ్యం

పెద్ద చెరువు రోడ్డుకు ఇరువైపులా బహిరంగ మల విసర్జనతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇక్కడ చెత్తాచెదారం పేరుకుపోయింది. కోళ్ల ఫారం వ్యర్థాలు, చనిపోయి జంతువులను పడేస్తున్నారు. దుర్గంధం భరించలేక అటువైపుగా రావాలంటే ప్రజలు భయపడి పోతున్నారు. మునిసిపల్‌ అధికారులు శుభ్రం చేయించాలని, హెచ్చరిక బోర్డులు పెట్టి చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-05-26T00:41:50+05:30 IST