రాత్రివేళల్లో ఈ తనిఖీలేంటి!?

ABN , First Publish Date - 2023-05-21T01:56:16+05:30 IST

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ అయితే ఏకంగా రాత్రి సమయాల్లో పాఠశాలలు తనిఖీ చేస్తుంటారు.

రాత్రివేళల్లో ఈ తనిఖీలేంటి!?

విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ తీరుపై ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి

వేసవిలో బాధ్యతల అప్పగింతపై ఇప్పటికే ఆగ్రహం

ప్రకటనకే పరిమితమైన ముఖ్యమంత్రి హామీ

విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):

‘‘ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం ఐదు గంటల దాటిన తరువాత కార్యాలయాల్లో ఉండాల్సిన అవసరం లేకుండా చూస్తాం. హాయిగా కుటుంబాలతో గడిపే స్వేచ్ఛ ఇస్తాం. వారిపై పని ఒత్తిడి లేకుండా చేస్తాం’

- ఇదీ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన.

...అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నిర్ణీత వేళలు ముగిసిన తరువాత కూడా ఉద్యోగులు పనిచేయాల్సిన పరిస్థితి అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకొని ఉంది. ఇక పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ అయితే ఏకంగా రాత్రి సమయాల్లో పాఠశాలలు తనిఖీ చేస్తుంటారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు వేసవి సెలవుల్లో విధులకు రావాలని ఆదేశించడం ఎంతవరకు సబబని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రవీణ్‌ప్రకాశ్‌ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు గాజువాక, ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అగనంపూడి జూనియర్‌ కళాశాల, పది గంటల సమయంలో అనకాపల్లి సమీపంలోని కొత్తతలారివానిపాలెం పాఠశాలలో నాడు-నేడు పనులు, అనంతరం 11 గంటలకు కశింకోట మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో జేవీకే కిట్లు తనిఖీ చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలు, వాటికి సంబంధించి శిక్షణ కేంద్రాలు, గోదాములు తనిఖీలు చేసుకోవచ్చునని, కానీ రాత్రిపూట తనిఖీలు చేయడం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి పది గంటల సమయంలో ఉన్నతాధికారి తనిఖీలకు వస్తారని తెలియడంతో పలువురు ఉద్యోగులు, టీచర్లు కంగారుపడుతున్నారు. ఆ సమయంలో తనిఖీలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో ఉద్యోగులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అనకాపల్లి జిల్లాకు చెందిన ఉపాఽధ్యాయ సంఘ నేత ఒకరు ప్రశ్నించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు కూడా మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-21T01:56:16+05:30 IST