మీ నమ్మకాన్ని నిలుపుకొంటాం
ABN , First Publish Date - 2023-03-05T03:00:10+05:30 IST
తమ ప్రభుత్వంపై విశ్వాసంతో పారిశ్రామికవేత్తలు భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటామని సీఎం జగన్ అన్నారు. విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు శనివారం ముగిసింది.
2 రోజుల్లో వివిధ కంపెనీలతో 378 ఎంఓయూలు
రాష్ట్రానికి 13,41,734 కోట్ల విలువైన పెట్టుబడులు
ఒక్క రెన్యువబుల్ ఎనర్జీలోనే రూ.8,84,823 కోట్లు
ఐటీలో రూ.25,587 కోట్లతో లక్ష మందికి ఉపాధి
ఒప్పందాల అమలుకు ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీ
పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తాం
పెట్టుబడిదారుల సదస్సు ముగింపు సభలో సీఎం జగన్
రెండో రోజు తగ్గిన కళ.. జగన్‌లో కనిపించని ఉత్సాహం
గంట ఆలస్యంగా సదస్సుకు.. ఆసాంతం అన్యమనస్కంగానే
మంత్రులకు దొరకని ప్రాధాన్యం.. కానరాని బొత్స
విశాఖపట్నం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వంపై విశ్వాసంతో పారిశ్రామికవేత్తలు భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటామని సీఎం జగన్ అన్నారు. విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రెండు రోజుల్లో 378 ఎంఓయూల ద్వారా రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడులకు సంతకాలు జరిగాయన్నారు. వీటిద్వారా 6.09 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఒక్క ఇంధన రంగంలోనే 40 ఒప్పందాల ద్వారా రూ.8,84,823 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, వీటిద్వారా 1.9లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐటీ రంగంలో 56 ఒప్పందాల ద్వారా రూ.25,587కోట్లు వస్తాయని, వాటిలో 1,04,442 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. పర్యాటక రంగంలో రూ.22,096 కోట్ల పెట్టుబడులకు 117 ఎంఓయూలు జరిగాయని, ఆయా సంస్థల్లో 30,787 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. పెద్దఎత్తున పెట్టుబడులు సమీకరించడానికి రెన్యువబుల్ ఎనర్జీయే ప్రస్తుతం అనుకూలంగా ఉందని, అందుకే వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. అత్యంత కీలక సమయంలో ఈ సదస్సు నిర్వహించామని, ఇది విజయవంతమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇకపై పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు నిర్వహించే కార్యకలాపాలకు ప్రభుత్వం తరపున మద్దతు ఇస్తామని జగన్ ప్రకటించారు. అందరితోనూ ఇదే అనుబంధం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలో వచ్చాక గత మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడిందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనేక రంగాలను ఆదుకుందన్నారు. రెండు రోజుల సదస్సులో ఆటోమొబైల్, హెల్త్‌కేర్, టూరిజం, ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ తదితర రంగాల్లో 15 సెషన్లలో 100 మంది ప్రసంగించారని, ఆయా రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు అందరికీ అవగతమయ్యాయన్నారు. అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, వియత్నాం, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రతినిధులతోనూ సెషన్లు నిర్వహించామన్నారు. ఎంఓయూలు చేసుకున్న వారంతా వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించాలని, అవసరమైన సహకారం ప్రభుత్వం తరపున అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎంవో అధికారులు, సీఎస్ అందులో సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ ప్రతివారం సమావేశమై ఒప్పందాల అమలుకు కృషిచేస్తుందన్నారు. ఇరువర్గాల ప్రయోజనాలు కాపాడుకునేలా పెట్టుబడిదారులు, ప్రభుత్వం పరస్పరం సహకరించుకోవాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.