జిల్లాకు చేరుకున్న వీవీప్యాట్‌లు

ABN , First Publish Date - 2023-06-26T01:30:16+05:30 IST

రానున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన వీవీప్యాట్‌లు జిల్లాకు ఆదివారం చేరుకున్నాయి. జిల్లాకు కేటాయించిన 3,100 వీవీప్యాట్‌లు మూడు కంటెయినర్‌లలో వచ్చాయి.

జిల్లాకు చేరుకున్న వీవీప్యాట్‌లు
పాడేరులో భద్రపరచిన వీవీప్యాట్‌లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

స్ర్టాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన ఉన్నతాధికారులు

పాడేరు, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రానున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన వీవీప్యాట్‌లు జిల్లాకు ఆదివారం చేరుకున్నాయి. జిల్లాకు కేటాయించిన 3,100 వీవీప్యాట్‌లు మూడు కంటెయినర్‌లలో వచ్చాయి. జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌ వాటిని స్వాధీనం చేసుకుని, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూమ్‌కు చేర్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌కు వీవీప్యాట్‌లు చేరిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అక్కడకు చేరుకుని వాటిని పరిశీలించారు. అలాగే వాటి భద్రతకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ఆయా వీవీప్యాట్‌లను స్ర్టాంగ్‌ రూమ్‌లో భద్రపరిచి సీలు వేయించారు. ఈ స్ట్రాంగ్‌ రూమ్‌కు నిరంతర పోలీసు భద్రతతోపాటు సీసీ కెమెరాల నిఘా సైతం ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. వీవీప్యాట్‌లు భద్రపరిచిన ప్రదేశంలో ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వీవీఎస్‌ శర్మ, స్థానిక తహసీల్దార్‌ త్రినాథరావునాయుడు, రెవెన్యూ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:30:16+05:30 IST