రైతు బాంధవుడు వీవీ రమణ

ABN , First Publish Date - 2023-06-26T01:20:53+05:30 IST

రాజ్యసభ మాజీ సభ్యుడు వీవీ రమణ రైతు బాంధవుడని, సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేసిన మహానీయుడని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. స్థానిక రింగురోడ్డులోని ఒక ప్రైవేటు కన్వెన్షన్‌ హాల్‌లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అధ్యక్షతన వీవీ రమణ శతజయంతి వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు తొలుత వీవీ రమణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రైతు బాంధవుడు వీవీ రమణ
వీవీ రమణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు, మళ్ల సాంబశివరావు, గౌతు శివాజీ, దాడి వీరభద్రరావు తదితరులు

సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేశారు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఘనంగా రమణ శత జయంతి వేడుకలు

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 25 : రాజ్యసభ మాజీ సభ్యుడు వీవీ రమణ రైతు బాంధవుడని, సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేసిన మహానీయుడని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. స్థానిక రింగురోడ్డులోని ఒక ప్రైవేటు కన్వెన్షన్‌ హాల్‌లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అధ్యక్షతన వీవీ రమణ శతజయంతి వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు తొలుత వీవీ రమణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రత్యేక రైలులో రైతులను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలిసేలా చేసిన మహావ్యక్తి రమణ అని అన్నారు. రాజకీయాల్లో రాజీ పడకుండా తనదైన శైలిలో రైతులకు సేవలందించారని చెప్పారు. రైతుల భాగస్వామ్యంతో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేసి చెరకు రైతులకు అండగా ఉంటూ ఎంతోమందికి ఉపాధి కల్పించారన్నారు. రమణ చూపిన మార్గంలో నమ్మిన సిద్ధాంతాలకు లోబడి ముందుకు సాగాలన్నారు. రైతు రుణం, తల్లి రుణం ఎవరూ తీర్చలేరని, అన్నం లేకపోతే జీవితం లేదని, అందువల్ల ప్రతి ఒక్కరూ రైతు శ్రమను గుర్తించాలని సూచించారు.

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, చట్టసభలను శాసించిన వ్యక్తి వెంకయ్యనాయుడు తెలుగువారు కావడం గర్వకారణమన్నారు. రాజ్యసభ చైర్మన్‌ పదవికి ఆయన వన్నె తెచ్చారని కొనియాడారు. దివంగత రాజ్యసభ మాజీ సభ్యుడు వీవీ రమణ రైతాంగ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేశారన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వేగి సూరిఅప్పారావు మాట్లాడుతూ, వీవీ రమణ ఏ పని తలపెట్టినా రాజీలేని పోరాటం చేసి రైతాంగానికి ఎనలేని సేవలందించారని పేర్కొన్నారు. మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ... వీవీ రమణతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని, ఆప్యాయతలను గుర్తు చేసుకున్నారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మళ్ల సాంబశివరావు మాట్లాడుతూ వీవీ రమణకు గుర్తుగా తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరారు. ఈ సందర్భంగా వీవీ రమణ శతజయంతి వేడుకల సావనీర్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆయనను మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, వైసీపీ పార్లమెంట్‌ పరిశీలకుడు దాడి రత్నాకర్‌, లీడర్‌ పత్రిక సంపాదకులు వీవీ రమణమూర్తి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ అధ్యక్షుడు కె.ఎస్‌.చలం, రాజా సాగి రామచంద్రరాజు, తమ్మన సుబ్బారావు, వీవీ రమణ తనయుడు రంగాజీ, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:20:53+05:30 IST