ఫ్యాక్టరీ పాయె!

ABN , First Publish Date - 2023-02-19T00:31:20+05:30 IST

‘వీవీ రమణ కో- ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని ఆధునికీకరిస్తాం. రైతులు, ఉద్యోగులను ఆదుకుంటాం’.. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీ ఇది. ‘రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. నూతన పరిశ్రమల స్థాపన కోసం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాం’.. రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తరచూ చెబుతున్న మాటలవి. ఇవన్నీ బూటకమని తేలిపోయింది. జిల్లాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన తుమ్మపాలలోని ది అనకాపల్లి వీవీ రమణ కో- ఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ కనుమరుగు కానుంది. ఫ్యాక్టరీని పూర్తిగా తొలగించి, ఆస్తులు, అప్పులు మదించేందుకు (లిక్విడేట్‌) చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఓ అధికారిని నియమించింది. నివేదిక సిద్ధమైన తరువాత ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టే యోచనలో ఉంది.

ఫ్యాక్టరీ పాయె!
అనకాపల్లి తుమ్మపాల వీవీ రమణ కో- ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ

- ఇప్పటికే దివాలా జాబితాలో చేరిక

- శాశ్వతంగా తొలగింపునకు తాజాగా ప్రభుత్వం నిర్ణయం

- రంగంలోకి దిగిన లిక్విడేట్‌ అధికారి, రహస్యంగా బాధ్యతల స్వీకరణ

- మాట నిలబెట్టుకోని సీఎం జగన్‌, మంత్రి అమర్‌నాథ్‌

- ప్రభుత్వ తీరుపై రైతులు, ఉద్యోగ సంఘాల ఆవేదన

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

‘వీవీ రమణ కో- ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని ఆధునికీకరిస్తాం. రైతులు, ఉద్యోగులను ఆదుకుంటాం’.. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీ ఇది.

‘రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. నూతన పరిశ్రమల స్థాపన కోసం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాం’.. రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తరచూ చెబుతున్న మాటలవి.

ఇవన్నీ బూటకమని తేలిపోయింది. జిల్లాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన తుమ్మపాలలోని ది అనకాపల్లి వీవీ రమణ కో- ఆపరేటివ్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ కనుమరుగు కానుంది. ఫ్యాక్టరీని పూర్తిగా తొలగించి, ఆస్తులు, అప్పులు మదించేందుకు (లిక్విడేట్‌) చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఓ అధికారిని నియమించింది. నివేదిక సిద్ధమైన తరువాత ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టే యోచనలో ఉంది.

--------

అనకాపల్లి మండలం తుమ్మపాలలో వీవీ రమణ సహకార షుగర్‌ ఫ్యాక్టరీ 24.05 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఫ్యాక్టరీ 1958 వరకు ఒక ప్రైవేటు సంస్థ యాజమాన్యంలో ఉండేది. తరువాత దీన్ని దివంగత మాజీ ఎంపీ వీవీ రమణ సహకార షుగర్‌ ఫ్యాక్టరీగా మార్చారు. చెరకు రైతులకు సుదీర్ఘ సేవలు అందించిన చరిత్ర ఈ ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 13,500 మంది చెరకు రైతులు భాగస్వాములుగా ఉన్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణానికి సమీపంలో మరో 4.05 ఎకరాల్లో సీడ్‌ ఫారం ఉంది. అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల పరిఽధిలో ఈ ఫ్యాక్టరీకి సంబంధించి 10 చెరకు తూనిక కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రానికి ఒక ఎకరా స్థలం ఉంది. మొత్తం ఫ్యాక్టరీకి చెందిన స్థిర, చర ఆస్తులు సుమారు రూ.240 కోట్లు ఉంటుందని గతంలో అంచనా వేశారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఫ్యాక్టరీ వైసీపీ ప్రభుత్వం తీరుతో కనిపించని పరిస్థితి నెలకొంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక మూసివేత

వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2020లో ఈ ఫ్యాక్టరీ మూత పడింది. జిల్లా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పరిశ్రమల శాఖా మంత్రి బాధ్యతలు చేపట్టడంతో ఈ ఫ్యాక్టరీ తెరుచుకుంటుందని అందరూ ఆశించారు. కానీ ఈ ఫ్యాక్టరీని దివాలా కంపెనీల జాబితాలో చేర్చి, అమ్మకానికి పెట్టారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ త్రిసభ్య కమిటీలో ఈ ఫ్యాక్టరీని లిక్విడేట్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ మూసివేసే సమయానికి 380 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి గ్రాట్యూటీ, వేతనాల కింద రూ.5.2 కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం 10 ఉద్యోగులు కొనసాగుతున్నారు.

మాటలకు, చేతలకు కుదరని పొంతన

మూతపడిన ఈ ఫ్యాక్టరీలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెడతామని, దీని వల్ల రైతులు, ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని మంత్రి అమర్‌నాథ్‌ పలు సందర్భాల్లో చెప్పారు. కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ ఈ ఫ్యాక్టరీ శాశ్వతంగా కనుమరుగయ్యేలా సిద్ధం చేసిన ఫైల్‌పై ఆయన సంతకం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1964 సహకార చట్టం ప్రకారం ఫ్యాక్టరీని లిక్విడేట్‌ చేసే అధికారం ప్రభుత్వాలకు లేనప్పటికీ వైసీపీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా గతంలోనే దివాలా ఫ్యాక్టరీల జాబితాలో చేర్చిందని, చెరకు రైతులు, ఉద్యోగ, కార్మిక సంఘాలను సంప్రతించకుండా తీసుకున్న ఈ నిర్ణయం చెల్లుబాటు కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లిక్విడేటర్‌ రంగంలోకి...

ఈ షుగర్‌ ఫ్యాక్టరీ లిక్విడేట్‌ అధికారిగా అనకాపల్లి జిల్లా అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ శాఖ అధికారి శాస్త్రిని ప్రభుత్వం నియమించింది. ఆయన శనివారం ఫ్యాక్టరీని సందర్శించి ఎండీ సన్యాసినాయుడు చేతుల మీదుగా ఫ్యాక్టరీ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫ్యాక్టరీ ఆస్తులు, అప్పులు, ఇతరత్రా ఉద్యోగులు, రైతులకు సంబంధించిన అన్ని వివరాలను సమీకరించి ప్రభుత్వానికి ఆయన నివేదిక ఇవ్వనున్నారు. అయితే శనివారం ఆయన బాధ్యతలు చేపట్టిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఉదయం 11 గంటల సమయంలో అధికారులు తమ్ముపాల షుగర్‌ ఫ్యాక్టరీ లోపలికి కార్లలో ప్రవేశించారు. వెంటనే సిబ్బందితో గేట్లు మూయించేశారు. కార్యాలయంలో లిక్విడేట్‌ అధికారికి బాధ్యతలు అప్పగించిన తరువాత మళ్లీ బయటకు వెళ్లిపోయారు. యథావిధిగా ఫ్యాక్టరీ గేట్లు మూసేశారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. ప్రభుత్వం ఫ్యాక్టరీ లిక్విడేట్‌ చేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు, ఫ్యాక్టరీలో ఉన్న ఒకరిద్దరు సిబ్బంది ఇంత గోప్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందో ప్రజలకు తెలియజేయాలని పలువురు కోరుతున్నారు.

--------

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే నిర్ణయం

తుమ్మపాల వీవీ రమణ సహకార షుగర్‌ ఫ్యాక్టరీ లిక్విడేట్‌ వ్యవహారాలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేన్‌ కమిషనర్‌ చూస్తున్నారు. జిల్లా సహకార శాఖ నుంచి ఒక అధికారిని నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫ్యాక్టరీ లిక్విడేట్‌ వ్యవహారాలు పర్యవేక్షిస్తారు.

- పి.కిరణ్‌కుమారి, జిల్లా సహకార అధికారి, అనకాపల్లి

------

Updated Date - 2023-02-19T00:31:21+05:30 IST