వీఎంఆర్‌డీఏ ఆపసోపాలు

ABN , First Publish Date - 2023-06-03T01:26:13+05:30 IST

భూముల విక్రయం ద్వారా నిధులు సమీకరించడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు.

వీఎంఆర్‌డీఏ ఆపసోపాలు

భూముల వేలానికి కొరవడిన స్పందన

రూ.500 కోట్లు ఖజానాకు జమ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌

ఆరు నెలలుగా యత్నింస్తుంటే రూ.50 కోట్లుకు మించి రాలేదు

లేఅవుట్‌లలో మిగిలి పోయిన ప్లాట్లకు ఈ వారంలో వేలం

చెప్పుకోదగ్గ స్థాయిలో రాని దరఖాస్తులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భూముల విక్రయం ద్వారా నిధులు సమీకరించడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. ఇళ్ల స్థలాల (ప్లాట్ల) వేలం ద్వారా రూ.500 కోట్లు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే గత ఆరు నెలలుగా ప్రయత్నిస్తుంటే రూ.50 కోట్లకు మించి సమకూరలేదు.

వీఎంఆర్‌డీఏ ఎప్పటికప్పుడు లేఅవుట్లలో ప్లాట్లతో పాటు ఖాళీగా ఉన్న భూములను వేలానికి పెడుతున్నా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ధరలు అధికంగా ఉండడం, అంతా వైట్‌లోనే చెల్లించాల్సి ఉండడంతో చాలా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. మధురవాడలో ఎకరాల చొప్పున భూములు ఉన్నాయి. వాటిని ఇప్పటికి ఎనిమిదిసార్లు వేలానికి ప్రకటన ఇచ్చారు. ఒక్కో స్థలం కొంటే...రూ.పది కోట్లకు పైగా చెల్లించాల్సి ఉండడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో వాటిని పక్కనపెట్టి పాత లేఅవుట్లలో ఖాళీగా వున్న ప్లాట్లను వేలానికి పెట్టారు. భీమునిపట్నం మండలం దాకమర్రిలో ఏడేళ్ల క్రితం లేఅవుట్‌ వేసి ప్లాట్లు విక్రయించారు. అందులో ఇంకా వందకు పైగా ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 30 ప్లాట్లను తాజాగా వేలానికి పెట్టారు. అవన్నీ హెచ్‌ఐజీ విభాగానికి చెందినవి. ఒక్కో ప్లాటు 400 గజాలకు పైగా ఉంటుంది. గజం అప్‌సెట్‌ ధర రూ.20 వేలుగా నిర్ణయించారు. ఈ మొత్తం చాలా ఎక్కువ. ఒక ప్లాటు కొనాలంటే కోటి రూపాయలు పెట్టాలి. ఇంకో పదేళ్లు దాటితే గానీ అక్కడ ఎటువంటి నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఉండదు. దాంతో చాలామంది ముందుకు రావడం లేదు. అలాగే పెదగంట్యాడ లేఅవుట్‌లో మరో 31 ప్లాట్లు వేలానికి పెట్టారు. అక్కడ కూడా హెచ్‌ఐజీలే ఉన్నాయి. గజం ధర రూ.40,500గా నిర్ణయించారు. అక్కడ ఒక ప్లాటు కొనాలంటే రూ.1.7 కోట్లు పెట్టాలి. భీమిలి మండలం కాపులుప్పాడలో గజం రూ.23,100 ధర పెట్టారు. ఈ విభాగంలో 29 ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. భీమిలి సమీపాన పద్మావతి లేఅవుట్‌లో గజం రూ.14,500 ధర పెట్టారు. కూర్మన్నపాలెంలో మిగిలిన ప్లాట్లకు గజం ధర రూ.30,500 నిర్ణయించారు. వీటన్నింటికీ ఈ నెల 5, 8 తేదీల్లో ఈ-వేలం నిర్వహించనున్నారు. ప్లాట్ల సంఖ్యకు సరిపడా కూడా దరఖాస్తులు రాలేదంటున్నారు. ఆశించిన సంఖ్యలో రాకుంటే వేలం తేదీ వాయిదా వేసి, దరఖాస్తుకు గడువు తేదీ పెంచాలని అధికారులు యోచిస్తున్నారు.

Updated Date - 2023-06-03T01:26:13+05:30 IST