భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు
ABN , First Publish Date - 2023-09-20T01:36:22+05:30 IST
వినాయక చవితిని అంతా సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆదిదేవుని ప్రతిమలను ఇంటింటా ప్రతిష్ఠించి మనసారా ఆరాధించారు.

వాడవాడలా కొలువుదీరిన స్వామి
ఒడ్డిమెట్టకు పోటెత్తిన భక్తజనం
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 19 : వినాయక చవితిని అంతా సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆదిదేవుని ప్రతిమలను ఇంటింటా ప్రతిష్ఠించి మనసారా ఆరాధించారు. ఇందులో భాగంగా అనకాపల్లిలోని గవరపాలెం వేగి గౌరీసువీధిలో స్థానికులు సుమారు ఎనిమిది వేల లక్ష్మీతామరపూసలతో గణనాథున్ని అలంకరించారు. ప్రముఖ శిల్పి విల్లూరి పరమేశ్వరరావు విగ్రహాన్ని తయారుచేయగా వేగి గౌరీ కుటుంబసభ్యులు ఈ అలంకరణ చేశారు.
నక్కపల్లి: మండలంలోని ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వినాయక చవితి సందర్భంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు జయంతి గోపాలకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ అప్పన్న, ఎస్‌ఐ శిరీష ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో ఎన్.వెంకట్రాది పాల్గొన్నారు.
తుమ్మపాల : వినాయక నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వీధివీధిన స్వామివారి పందిళ్లు వేశారు. తుమ్మపాల, మామిడిపాలెం, ఊడేరు తదితర గ్రామాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బవులవాడలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ ప్రత్యేక పూజలను నిర్వహించారు.
పరవాడ : చవితి వేడుకలను మండలవాసులు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. వెన్నెలపాలెంలోని మరిడిమాంబ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన విగ్రహం వద్ద మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరవాడ బొంకులదిబ్బ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, సర్పంచ్ సిరపురపు అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ చుక్క రామునాయుడు, ఉపసర్పంచ్ బండారు రామారావు, యూత్ ప్రతినిధులు పైలా పైడంనాయుడు తదితరులు పూజలు జరిపారు. సింహాద్రి ఎన్టీపీసీలోని దీపాంజలినగర్‌లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద సంస్థ జీజీఎం సంజయ్‌కుమార్ సిన్హా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలావుంటే, వెన్నెలపాలెంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద ‘బాబుతో నేను’ కరపత్రాలను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు.
ఎలమంచిలి : చవితి వేడుకల్లో భాగంగా ఎలమంచిలి పట్టణంలో పలు చోట్ల వివిధ రూపాల్లో గణనాథుడు కొలువుదీరాడు. మిలటరీ కాలనీ ఏర్పాటు చేసిన విగ్రహంతో పాటు రామాలయం యాతపేట వీధిలో రావణ సంహార రూపంలో ఉన్న విగ్రహం, లొట్లవారి వీధిలో ఆలయం సెట్‌లో ఏర్పాటు చేసిన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
సబ్బవరం : మండలంలోని వినాయక చవితిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సబ్బవరం, దేవీపురం, ఆరిపాక, అంతకాపల్లి, అమృతపురం, గుల్లేపల్లి, అసకపల్లి, మొగలిపురం, మలునాయుడుపాలెం, గొల్లలపాలెం తదితర గ్రామాల్లో వీధివీధిన స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. దేవీపురంలో గురుపత్ని అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
పాయకరావుపేట/రూరల్ : వినాయక చవితి పర్వది నాన్ని పాయకరావుపేట ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పాండురంగస్వామి ఆలయం, మంగవరం రోడ్డులోని సీతారామాలయం, బృందావనంలోని దుర్గాలమ్మచెట్టు ఆలయం, కరణంగారి వీధి, పెదిరెడ్డివారి వీధిలోని వరసిద్ధి వినాయక ఆలయాల్లో వినాయక చవితి పూజలు జరిపారు. వీధివీధిన పందిళ్లు వేసి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే, మండలంలోని గ్రామ గ్రామాన చివితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామాల్లో యువకులు వీధి వీధిన పందిళ్లు వేసి ఆదిదేవుని విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నర్వహిస్తున్నారు.
ఎస్.రాయవరం : మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వీధివీధిన గణనాథుని విగ్రహాలను ప్రతిష్ఠించి మనసారా ఆరాధిస్తున్నారు. పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎస్.రాయవరం, అడ్డరోడ్డు తిమ్మాపురం, దార్లపూడి తదితర గ్రామాల్లో స్వామివారి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
రాంబిల్లి : వినాయక చవితి వేడుకలను మండలవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఇంటింటా స్వామివారి ప్రతిమను ఉంచి పూజలు నిర్వహించారు. గ్రామాల్లోని వీధివీధి గణనాథుని విగ్రహాలను ప్రతిష్ఠించారు. దీంతో రాంబిల్లి, దిమిలి, లాలంకోడూరు, అప్పన్నపాలెం, పంచదార్ల, అప్పారాయుడుపాలెం, వై.లోవ, పెదకలవలాపల్లి, వెల్చూరు, రాజుకోడూరు, కృష్ణంపాలెం, హరిపురం, వెంకటాపురం నారాయణపురం గోకివాడ, వాడనర్సాపురం, కొత్తపట్నం తదితర గ్రామాల్లో ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంది. ప్రముఖ శైవక్షేత్రం పంచదార్లలోని ఉమాధర్మలింగేశ్వర ఆలయంలో స్వామికి అర్చకులు విశేష పూజలు జరిపారు.
ఎలమంచిలి : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఇక్కడ చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఆ పార్టీ నాయకులు సోమవారం వినాయక చవితి వేడుకలను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వ ర్యంలో మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావుల సమక్షంలో జరిపారు. అర్చకులు గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొలుకులూరి విజయ్‌బాబు, నాయకులు కొఠారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, రాజాన సూర్యనాగేశ్వరావు, రాజాన నారాయణమ్మ, గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, కరణం రవి, నానేపల్లి సుబ్బయ్యనాయుడు, సాగర్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.