ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు

ABN , First Publish Date - 2023-02-05T01:36:13+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ మార్చింది.

ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు

గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చిన టీడీపీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ మార్చింది. గతంలో ప్రకటించిన గాడు చిన్నికుమారిలక్ష్మి స్థానంలో అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని రావికమతం మండలానికి చెందిన రిటైర్డు అధ్యాపకుడు వేపాడ చిరంజీవిరావును ఎంపిక చేసింది. ఇందుకు చిన్నికుమారిలక్ష్మి అంగీకారం కూడా తీసుకున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిరంజీవిరావుకు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ సభ్యత్వం ఇవ్వడంతోపాటు పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, చోడవరం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, పార్టీ నాయకులు గాడు అప్పలనాయుడు, గూనూరు మల్లునాయుడు, పాశర్ల ప్రసాద్‌, కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.

అధ్యాపక వృత్తి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకనామిక్స్‌ అధ్యాపకునిగా పనిచేస్తున్న చిరంజీవిరావు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు. పది రోజుల క్రితం ప్రభుత్వం ఆమోదం తెలపడంతో చిరంజీవిరావు అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల ఇన్‌చార్జుల సమావేశం ఈనెల ఆరో తేదీన విశాఖలో నిర్వహించనున్నారు. ఆ తరువాత చిరంజీవిరావు, గాడు చిన్నికుమారిలక్ష్మి, ఆమె భర్త గాడు అప్పలనాయుడును విజయవాడలో పార్టీ అధినేత వద్దకు తీసుకువెళ్లాలని నాయకులు నిర్ణయించారు.

ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కార్కానికి కృషి: చిరంజీవిరావు

ఉత్తరాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు వేపాడ చిరంజీవిరావు తెలిపారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తాను రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన సామాన్య కుటుంబం నుంచి వచ్చానని, 1996 డీఎస్సీలో ఎస్జీటీ, 1998లో స్కూలు అసిస్టెంట్‌గా, 2002లో జూనియర్‌ లెక్చరర్‌గా, ఆ తరువాత డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా ఎంపికయ్యానన్నారు. గడచిన 12 సంవత్సరాలుగా ఎకనామిక్స్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్నానన్నారు. సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తూ గత నెలలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశానన్నారు. ఎకనామిక్స్‌లో పరిశోధన చేశానని చిరంజీవిరావు తెలిపారు.

Updated Date - 2023-02-05T01:36:14+05:30 IST