మండుతున్న కూరగాయల ధరలు

ABN , First Publish Date - 2023-03-16T00:47:58+05:30 IST

ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా మండుతున్నాయి. వేసవి కారణంగా కొన్ని పంటల దిగుబడి తగ్గింది. స్థానికంగా పండించే రకాలు మార్కెట్‌కు తక్కువగా రావడంతో వాటికి డిమాండ్‌ ఏర్పడి ధర పెరుగుతోంది.

మండుతున్న కూరగాయల ధరలు

విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి

ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా మండుతున్నాయి. వేసవి కారణంగా కొన్ని పంటల దిగుబడి తగ్గింది. స్థానికంగా పండించే రకాలు మార్కెట్‌కు తక్కువగా రావడంతో వాటికి డిమాండ్‌ ఏర్పడి ధర పెరుగుతోంది. గత పది రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన ధరలు మంగళ, బుధవారాల్లో కిలోకు నాలుగైదు రూపాయలు తగ్గినా మళ్లీ వారం రోజుల్లో పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. టమాటా ఈ నెల ప్రారంభంలో కిలో రూ.14కి లభించేది. శని, ఆదివారాల్లో ఇది కిలో రూ.24కి చేరింది. బుధవారం నాటికి రూ.16కి తగ్గింది. బెండ, బీర, దొండకాయలు కిలో రూ.30 ఉండేవి. గత వారం ఇవి రూ.40 దాటి రూ.50 వరకు వెల్లాయి. ఇప్పుడు బెండ కిలో రూ.44, బీర రూ.38, దొండ రూ.36కి దొరుకుతున్నాయి. వెల్లంకి వంకాయలు కిలో రూ.40, నలుపు రూ.34 చొప్పున అమ్ముతున్నారు. కిలో రూ.20కి అమ్మిన బరబాటి దిగుబడి బాగా తగ్గిపోవడంతో రూ.42కి అమ్ముడవుతోంది. చిక్కుడు రకాల ధరలు కిలో రూ.4 నుంచి రూ.10 వరకు పెరిగాయి. దేముడు చిక్కుడు కిలో రూ.64, బీన్స్‌ రూ.44కి విక్రయిస్తున్నారు.

శీతాకాలపు పంటలకు గిరాకీ

శీతాకాలంలో మార్కెట్‌కి బాగా వచ్చిన కాలీఫ్లవర్‌, క్యాబేజీ, చిక్కుడు, టమాటా ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. కిలోకి రూ.10 వరకు ప్రస్తుతం ధర పెరిగింది. దిగుబడి ఇంకా తగ్గితే రేట్లు మరింత అధికమవుతాయి. కోల్‌కతా నుంచి వచ్చే బంగాళాదుంప రేటు కూడా పెరిగింది. కిలో రూ.12 ఉండే రేటు రూ.15కి చేరింది. గ్రీన్‌పీస్‌ కిలో రూ.40కి దొరికేది. ఇప్పుడు రూ.52 చొప్పున అమ్ముతున్నారు. క్యాలీ ఫ్లవర్‌ పువ్వు రూ.10 నుంచి రూ.15కి ఇచ్చేవారు. ఇప్పుడు రూ.22 చొప్పున విక్రయిస్తున్నారు.

Updated Date - 2023-03-16T00:47:58+05:30 IST