నిరుపయోగంగా చెత్త డబ్బాలు

ABN , First Publish Date - 2023-06-01T01:16:38+05:30 IST

మునిసిపాలిటీలో ప్రజారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ కొరవడడంతో లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన చెత్త డబ్బాలు వ్యర్థంగా పడివున్నాయి. పట్టణంలో మొత్తం 62 ట్విన్‌ బిన్స్‌ను ఏర్పాటు చేయగా.. వీటిల్లో సగం కూడా వినియోగంలో లేవు. ఆకతాయిలు కొన్ని డస్ట్‌బిన్లను విరగ్గొట్టి ఎత్తుకుపోయారు.

నిరుపయోగంగా చెత్త డబ్బాలు
కొక్కిరాపల్లి వార్డులో డ్రైనేజీ కాలువలో వుంచిన చెత్త డబ్బాలు

ప్రజారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం

కొరవడిన ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ

లక్షలాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం

తడి, పొడి చెత్త సేకరణ కోసం రూ.11 లక్షలతో 62 ట్విన్‌బిన్స్‌ కొనుగోలు

పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు

వినియోగంపై అవగాహన కల్పించని ప్రజారోగ్య శాఖ సిబ్బంది

సగానికిపైగా డబ్బాలు నిరుపయోగం

పలుచోట్ల అపహరణకు గురైన బిన్స్‌

ఎలమంచిలి, మే 31: మునిసిపాలిటీలో ప్రజారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ కొరవడడంతో లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన చెత్త డబ్బాలు వ్యర్థంగా పడివున్నాయి. పట్టణంలో మొత్తం 62 ట్విన్‌ బిన్స్‌ను ఏర్పాటు చేయగా.. వీటిల్లో సగం కూడా వినియోగంలో లేవు. ఆకతాయిలు కొన్ని డస్ట్‌బిన్లను విరగ్గొట్టి ఎత్తుకుపోయారు.

స్వచ్ఛ భారత్‌, క్లీన్‌ ఏపీలో భాగంగా పరిసరాల పరిశుభ్ర కోసం మునిసిపాలిటీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికి ప్లాస్టిక్‌ డస్‌బిన్లు పంపిణీ చేశారు. అదే విధంగా హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, ఆలయాలు, కూరగాయల మార్కెట్‌, తదితర ప్రాంతాల్లో రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా వుండడానికి తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడానికి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ (ఎస్‌ఎస్‌) డస్ట్‌బిన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఒక్కొక్కటి రూ.18 వేల చొప్పున 62 ట్విన్‌బిన్స్‌ను సుమారు రూ.11 లక్షలతో కొనుగోలు చేసి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటిపై ‘చెత్త బుట్టలను ఉపయోగిద్దాం.. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం’ అని రాశారు. అయితే ట్విన్‌బిన్స్‌ వినియోగంపై ప్రజలకు, వ్యాపారులకు తగిన అవగాహన కల్పించలేదు. దీంతో సగానికిపైగా బిన్స్‌ నిరుపయోగంగా పడివున్నాయి. వాస్తవంగా వీటిని ఎవరూ ఎత్తుకెళ్లకుండా, గాలులకు పడిపోకుండా వుండడానికి భూమిలో పాతాలి. కానీ కొన్నింటిని పాతకుండా ఎక్కడపడితే అక్కడ వదిలేశారు. కొత్తపేట రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ట్విన్‌బిన్స్‌ను నేలలో నుంచి పీకేసి పక్కన పెట్టారు పరమేశ్వరి థియేటర్‌ జంక్షన్‌లో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ట్విన్‌బిన్స్‌ డబ్బాలు మాయం అయ్యాయి. స్టీల్‌ పైపులు మాత్రమే మిగిలాయి. కొక్కిరాపల్లి వార్డులో డ్రైనేజీ కాలువలో పడేశారు. మరికొన్నిచోట్ల చెత్తాచెదారాన్ని ఈ బిన్స్‌లో వేయకుండా పక్కనే కింద పడేస్తున్నారు. దీంతో పందులు, కుక్కలు చేరి చెత్తాచెదారాన్ని చిందరవందర చేస్తున్నాయి. మునిసిపల్‌ అధికారులు వెంటనే స్పందించి ట్విన్‌బిన్స్‌ను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని పట్టణ పౌరులు విజ్ఞప్తిచేస్తున్నారు.

Updated Date - 2023-06-01T01:16:38+05:30 IST