వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2023-02-07T00:59:57+05:30 IST
బుచ్చెయ్యపేట, రోలుగుంట మండలాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బుచ్చెయ్యపేట మండలం రాజాంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో యజమాని అక్కడికక్కడే మృతి చెందాడు. రోలుగుంట మండలం బలిజిపాలెం వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో తాపీ మేస్ర్తీ చనిపోయాడు. వివరాల్లోకి వెళితే..

రాజాంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా
ఇంజన్ కింద పడడంతో యజమాని మృతి
బలిజిపాలెంలో చెట్లును ఢీకొన్న బైక్
తాపీమేస్తీ దుర్మరణం
బుచ్చెయ్యపేట/ రోలుగుంట, ఫిబ్రవరి 6: బుచ్చెయ్యపేట, రోలుగుంట మండలాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బుచ్చెయ్యపేట మండలం రాజాంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో యజమాని అక్కడికక్కడే మృతి చెందాడు. రోలుగుంట మండలం బలిజిపాలెం వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో తాపీ మేస్ర్తీ చనిపోయాడు. వివరాల్లోకి వెళితే..
పరవాడ మండల భరణికం గ్రామానికి చెందిన గంట్రెడ్డి సత్యారావు తన ట్రాక్టర్‌తో సోమవారం బుచ్చెయ్యపేట మండలం రాజాంలో సుంకర సత్యారావు అనే రైతుకు చెందిన వరి కుప్పలు నూర్చాడు. అనంరతం గడ్డిని రైతు కల్లానికి ట్రాక్టరుతో తీసుకెళ్లాడు. గడ్డితో వున్న తొట్టిని అక్కడ విడిచి పెట్టి, ట్రాక్టర్‌తో తిరిగి బయలుదేరాడు. భూలోకమ్మ గుడి సమీపంలో ట్రాక్టరు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకుపోయి బోల్తా పడింది. దీంతో సత్యారావుపై ఇంజన్ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌పై కూర్చొన్న రైతు సత్యారావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కుమారస్వామి తెలిపారు.
చెట్టును ఢీకొన్న బైక్.. తాపీ మేస్త్రీ మృతి
రోలుగుంట మండలం మండలంలోని జగ్గంపేట పంచాయతీ ఎల్.కొత్తూరు గ్రామానికి చెందిన లగుడు రాము(32) తాపీమేస్ర్తీగా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బలిజిపాలెం బయలుదేరాడు. గ్రామానికి సుమారు అర కిలోమీటరు దూరంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. దీంతో రాము తలకు తీవ్రగాయం కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నాగకార్తీక్, సిబ్బంది వెళ్లి పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి పెదనాన్న అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.