లిక్విడ్ గంజాయితో గిరిజనుడి అరెస్టు
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:30 PM
పొరుగు రాష్ట్రాలకు లిక్విడ్ గంజాయి ఎగుమతి చేస్తున్న ఓ గిరిజనుడిని పట్టుకున్నట్టు అదనపు ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. అతడి వద్ద 7.2 కిలోల లిక్విడ్ గంజాయి, రూ.23.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
7.2 కిలోల లిక్విడ్ గంజాయి, రూ.23.5 లక్షలు స్వాధీనం
పట్టుబడ్డ గంజాయి విలువ రూ.30 లక్షలు
అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్
చింతపల్లి, డిసెంబరు 23: పొరుగు రాష్ట్రాలకు లిక్విడ్ గంజాయి ఎగుమతి చేస్తున్న ఓ గిరిజనుడిని పట్టుకున్నట్టు అదనపు ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. అతడి వద్ద 7.2 కిలోల లిక్విడ్ గంజాయి, రూ.23.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని జి.మాడుగుల మండలం లువ్వసింగి పంచాయతీ అలగాం గ్రామానికి చెందిన వూలంగి రాజారావు తమిళనాడుకు చెందిన గంజాయి స్మగ్లర్లతో స్నేహ సంబంధాలు పెంచుకుని, లిక్విడ్ గంజాయి తయారుచేయడం నేర్చుకున్నాడన్నారు. రెండేళ్ల క్రితం చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ గొప్పగుడుసుల గ్రామం వద్ద తమిళనాడుకు చెందిన గంజాయి వ్యాపారులు, అదే గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తితో కలిసి లిక్విడ్ గంజాయి తయారుచేశారన్నారు. తమిళనాడు వ్యాపారులు లిక్విడ్ గంజాయి తీసుకుపోయి యంత్రాన్ని (మిషనరీ) వదిలేశారన్నారు. దాన్ని ఈ ఏడాది జనవరిలో వూలంగి రాజారావు ఒడిశా రాష్ట్రం చింతల్ దూళి ప్రాంతంలోని స్నేహితుడు అర్జున్ వద్దకు తీసుకువెళ్లి లిక్విడ్ గంజాయి తయారు చేస్తున్నాడన్నారు. దానిని ప్యాకెట్ల రూపంలో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వ్యాపారులకు చింతపల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన రాజు సహకారంతో విక్రయిస్తూ రూ.లక్షల్లో సంపాదించాడన్నారు. శనివారం ఉదయం లోతుగెడ్డ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న రాజారావును అన్నవరం పోలీసులు తనిఖీ చేయగా...అతని బ్యాగ్‌లో రెండు ప్యాకెట్ల లిక్విడ్ గంజాయి, రూ.23.5 లక్షల నగదు లభించాయన్నారు. అలాగే రాజారావు స్వగ్రామంలో మరో ఆరు ప్యాకెట్ల లిక్విడ్ గంజాయి ఉందన్నారు. ద్విచక్ర వాహనం, 7.2 కిలోల లిక్విడ్ గంజాయి, రూ.23.5 లక్షల నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్టు అదనపు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీఐ కె.రమేశ్, అన్నవరం ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.