పుష్ప తరహాలో గంజాయి రవాణా

ABN , First Publish Date - 2023-05-31T22:45:18+05:30 IST

పుష్ప సినిమా తరహాలో వ్యాన్‌ కింద ప్రత్యేక అర చేయించి గంజాయి తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు మంగళవారం సాయంత్రం చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు 310 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పుష్ప తరహాలో గంజాయి రవాణా
పోలీసులు స్వాధీనం చేసుకున్న వ్యాన్‌, గంజాయి బస్తాలు

చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

310 కిలోల గంజాయి స్వాధీనం

ముగ్గురి అరెస్టు

ముంచంగిపుట్టు, మే 31: పుష్ప సినిమా తరహాలో వ్యాన్‌ కింద ప్రత్యేక అర చేయించి గంజాయి తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు మంగళవారం సాయంత్రం చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు 310 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ కె.రవీంద్ర బుధవారం తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

మండలంలోని లబ్బూరు జంక్షన్‌ వద్ద మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్‌ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంగా ఒడిశా మల్కన్‌గిరి నుంచి లబ్బూరు మీదుగా వస్తున్న ఒక వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. పుష్ప సినిమా తరహాలో వ్యాన్‌ కింది భాగంలో ప్రత్యేక అర చేయించి అందులో గంజాయిని అమర్చినట్టు గుర్తించారు. ఆ అర పైభాగాన్ని తొలగించి సుమారు 310 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఒడిశా కోరాపుట్‌ జిల్లా గోటిపుట్టు గ్రామానికి చెందిన తంగి అజయ్‌, జలపుట్టు గ్రామానికి చెందిన రమేశ్‌కుమార్‌ బెనియా, అమలాపుట్టు గ్రామానికి చెందిన సుభాష్‌ సీసాలను అదుపులోకి తీసుకుని, వ్యాన్‌ను సీజ్‌ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. ఈ తనిఖీల్లో ఏఎస్‌ఐ తిరుపతి, హెచ్‌సీ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

5 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్టు

అరకులోయ: అరకు రైల్వే స్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల బ్యాగులను తనిఖీ చేసి ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అరకు ఎస్‌ఐ సంతోశ్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం అరకు రైల్వే స్టేషన్‌ వద్ద చిత్తూరు జిల్లాకు చెందిన టి.షము, జీకే వీధికి చెందిన గెమ్మెల రమేశ్‌, డుంబ్రిగుడ మండలానికి చెందిన కొర్రా లక్ష్మణ్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో బ్యాగులను తనిఖీ చేశామని, వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. వారిని బుధవారం కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారన్నారు. షముకు రమేశ్‌, లక్ష్మణ్‌లు గంజాయి సరఫరా చేశారని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-05-31T22:45:18+05:30 IST