క్రైమ్ డీసీపీ నాగన్న బదిలీ
ABN , First Publish Date - 2023-11-23T01:29:40+05:30 IST
నగర పోలీస్ కమిషనరేట్‌లో క్రైమ్ డీసీపీగా పనిచేస్తున్న జి.నాగన్నను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో నాగన్న ఒక్కరినే బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఏడాది కిందట క్రైమ్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన నాగన్నకు ఈ ఏడాది ఏప్రిల్‌లో సింహాచలం చందనోత్సవం బందోబస్తు బాధ్యతలు అప్పగించారు.
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్‌లో క్రైమ్ డీసీపీగా పనిచేస్తున్న జి.నాగన్నను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో నాగన్న ఒక్కరినే బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఏడాది కిందట క్రైమ్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన నాగన్నకు ఈ ఏడాది ఏప్రిల్‌లో సింహాచలం చందనోత్సవం బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. చందనోత్సవం సందర్భంగా పోలీసుల పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఘాట్‌రోడ్డులో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో వీఐపీలు సైతం నడుచుకుంటూ ఆలయానికి చేరుకోవాల్సి వచ్చింది. దీనిపై అప్పట్లోనే శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు. నాగన్న పనితీరు సరిగా లేకపోవడమే వైఫల్యానికి కారణమని తేలడంతో ఆయన్ను బదిలీ చేశారని కొంతమంది పేర్కొంటున్నారు. డీసీపీ నాగన్న తమను ఇండెంట్ల కోసం వేధిస్తున్నారంటూ సీఐలు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని, ఆ కారణంగానే ఆయన్ను బదిలీ చేసి ఉంటారని మరికొందరు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా ఆదివారం జరిగిన హార్బర్‌లో ప్రమాదంపై కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను డీసీపీ నాగన్నకు అప్పగించారు. కేసు దర్యాప్తులో వైఫల్యం కూడా బదిలీకి కారణమై ఉంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా సీపీ రవిశంకర్‌అయ్యన్నార్ బుధవారం విజయవాడలో ఉన్నప్పుడే డీసీపీ నాగన్న బదిలీ ఉత్తర్వులు వెలువడడం విశేషం.