Share News

పొగమంచుతో రైళ్లు ఆలస్యం

ABN , Publish Date - Dec 30 , 2023 | 01:29 AM

పొగమంచు ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

పొగమంచుతో రైళ్లు ఆలస్యం

ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే సర్వీస్‌లపై ఎక్కువ ప్రభావం

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ 16 గంటల లేటు

సమత, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లదీ అదే పరిస్థితి

సికింద్రాబాద్‌ నుంచి వచ్చే రైళ్లపైనా స్వల్ప ప్రభావం

విశాఖపట్నం, డిసెంబరు 29:

పొగమంచు ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే న్యూఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (20 806), నిజాముద్దీన్‌-విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్‌ (12808), నిజాముద్దీన్‌-విశాఖ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌ (1204) రైళ్లు పది గంటలకుపైగా ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ 16 గంటలు ఆలస్యం

పొగ మంచు ప్రభావం ఏపీ ఎక్స్‌ప్రెస్‌పై ఎక్కువగా పడుతోంది. జత రేక్‌లు నిర్ణీత సమయానికి అందుబాటులోకి రాకపోవడంతో విశాఖ నుంచి బయలుదేరే రైలును రీ షెడ్యూల్‌ చేసి నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది. న్యూఢిల్లీ నుంచి విశాఖ వచ్చే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (20806) శుక్రవారం దాదాపు 16 గంటలు ఆలస్యంగా నడిచింది. నిర్ణీత సమయం ప్రకారం ఈ రైలు ఉదయం 4.10 గంటలకు విశాఖ చేరాల్సి ఉండగా, రాత్రి 10.00 గంటల ప్రాంతంలో విశాఖ స్టేషన్‌కు చేరింది. దీంతో శుక్రవారం రాత్రి 11.00 గంటలకు విశాఖ నుంచి న్యూఢిల్లీ బయలుదేరాల్సిన 20805 నంబరు గల రైలును శనివారం ఉదయం 9.00 గంటలకు బయలుదేరే విధంగా రీ షెడ్యూల్‌ చేశారు. అలాగే నిజాముద్దీన్‌ నుంచి విశాఖ వచ్చే సమతా ఎక్స్‌ప్రెస్‌ (12808) శుక్రవారం దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా నడిచింది. నిర్ణీత సమయం ప్రకారం...ఈ రైలు సాయంత్రం 4.30 గంటలకు రావాల్సి ఉండగా, రాత్రి 10.30 గంటల ప్రాంతంలో విశాఖపట్నం చేరుకుంది. అలాగే, నిజాముద్దీన్‌ నుంచి స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌ (12804) నిర్ణీత సమయం ప్రకారం మధ్యాహ్నం 2.15 గంటలకు చేరాల్సి ఉండగా, రాత్రి 9.30 గంటలకు విశాఖకు వచ్చింది.

సికింద్రాబాద్‌ రైళ్లు గంట లేటు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వచ్చే రైళ్లపై కూడా పొగ మంచు ప్రభావం కొంత మేర పడుతోంది. దీంతో గరీబ్‌రధ్‌ ఎక్స్‌ప్రెస్‌ (12739), విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17016) తదితర రైళ్లు రెండు రోజులుగా సుమారు గంటకుపైగా ఆలస్యంగా చేరుతున్నాయి.

మరికొద్దిరోజులు ఆలస్యమయ్యే అవకాశం

పొగ మంచు కారణంగా విశాఖ-న్యూఢిల్లీ చుటుపక్కల ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (20805/20806), సమతా (12807/ 12808), స్వర్ణ జయంతి (12803/12804), విశాఖ-అమృతసర్‌-విశాఖ హిరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ (20807/20808) రైళ్లు మరికొద్ది రోజులు ఆలస్యంగా నడిచే అవకాశాలున్నాయి.

Updated Date - Dec 30 , 2023 | 01:29 AM