విహార యాత్రలో విషాదం

ABN , First Publish Date - 2023-01-27T01:08:39+05:30 IST

విహార యాత్రకు వచ్చి ప్రమాదవశాత్తూ గాదిగుమ్మి జలపాతంలో జారిపడి విశాఖపట్నానికి చెందిన నేవీ మాజీ ఉద్యోగి మృతి చెందారు. కళ్లెదుటే ఆయన గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం వేపగుంట సమీప పురుషోత్తపురానికి చెందిన మంతిన సుబ్బరాజు(41) నేవీ మాజీ ఉద్యోగి. ఆయన ప్రస్తుతం న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్నారు.

              విహార యాత్రలో విషాదం
మృతుడు సుబ్బరాజు

- గాదిగుమ్మి జలపాతంలో పడి విశాఖ వాసి మృతి

- ఫొటోలు దిగుతుండగా కాలు జారి పడడంతో గల్లంతు

- మూడు గంటల పాటు గాలించడంతో మృతదేహం లభ్యం

- కళ్లెదుటే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు, స్నేహితుడు కన్నీరు మున్నీరు

కొయ్యూరు/కృష్ణాదేవిపేట, జనవరి 26 : విహార యాత్రకు వచ్చి ప్రమాదవశాత్తూ గాదిగుమ్మి జలపాతంలో జారిపడి విశాఖపట్నానికి చెందిన నేవీ మాజీ ఉద్యోగి మృతి చెందారు. కళ్లెదుటే ఆయన గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం వేపగుంట సమీప పురుషోత్తపురానికి చెందిన మంతిన సుబ్బరాజు(41) నేవీ మాజీ ఉద్యోగి. ఆయన ప్రస్తుతం న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. నర్సీపట్నంలో బంధువుల వివాహానికి భార్య శిరీషా, కుమార్తె లాస్య(10), కుమారుడు కార్తీక్‌(7)తో పాటు తనతో పని చేసిన శివశంకర్‌, అతని కుటుంబ సభ్యులతో బుధవారం రాత్రి వచ్చారు. వీరంతా గురువారం ఉదయం కొయ్యూరు మండలం వలసంపేట సమీప గాదిగుమ్మి జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. జలపాతంలో కుటుంబ సభ్యులు, స్నేహితుడితో ఫొటోలు తీసుకున్నారు. అయితే అప్పటికే సుబ్బరాజు స్నేహితుడు బయటకు వచ్చేయమని కోరాడు. ఏమీ కాదని, ఫొటోలు తీయమని స్నేహితుడితో పాటు తన కుమార్తె లాస్యకు చెప్పి సుబ్బరాజు స్నానం చేస్తూ ఉండిపోయాడు. వారిద్దరూ ఫొటోలు తీస్తుండగా ఫొటోకి ఫోజులిచ్చే క్రమంలో అతను ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాడు. సుమారు 40 అడుగుల ఎత్తైన కొండ పైనుంచి జారి దిగువనున్న గుమ్మిలోకి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అతనికి ఈత వచ్చినప్పటికీ తేరుకునే లోపే గుమ్మిలోకి వెళ్లిపోవడంతో అక్కడ అడుగున ఉన్న రెండు రాళ్ల మధ్య చిక్కుకుపోయాడు. అతని కుటుంబ సభ్యులతో పాటు పర్యాటకులు గాలించినా ఫలితం లేకపోయింది. సుబ్బరాజు భార్య ఫిర్యాదు మేరకు కొయ్యూరు ఎస్‌ఐ రాజారావు తన సిబ్బందితో అక్కడికి వచ్చి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుమారు మూడు గంటల తరువాత విగతజీవిగా ఉన్న సుబ్బరాజును గుర్తించి బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. విహార యాత్రకు వచ్చి కళ్లెదుటే సుబ్బరాజు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

Updated Date - 2023-01-27T01:08:40+05:30 IST