లంబసింగికి పర్యాటకుల తాకిడి
ABN , First Publish Date - 2023-11-14T00:48:38+05:30 IST
ఆంధ్రకశ్మీర్‌గా ప్రసిద్ధి చెందిన లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. రెండో శనివారం, ఆదివారం, దీపావళి సెలవులు కలిసిరావడంతో మూడు రోజుల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
చెరువులవేనం వద్ద తెల్లవారుజాము నుంచే సందడి
చింతపల్లి, నవంబరు 13: ఆంధ్రకశ్మీర్‌గా ప్రసిద్ధి చెందిన లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. రెండో శనివారం, ఆదివారం, దీపావళి సెలవులు కలిసిరావడంతో మూడు రోజుల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయం, తదితర ప్రదేశాల వద్ద తెల్లవారుజాము నుంచే పర్యాటకులు సందడి చేస్తున్నారు. చెరువులవేనంలో మంచు అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారు. ఈశాన్య భారతదేశంలో ఉన్నామా? ఆంధ్రప్రదేశ్‌లో వున్నామా? అన్న సందేహం కలుగుతున్నదని పలువురు పర్యాటకులు అంటున్నారు. కాగా పర్యాటకుల తాకిడితో లంబసింగి, చుట్టుపక్కల ప్రాంతాల్లో వున్న ప్రైవేటు రిసార్టులు, కాటేజీలకు గిరాకీ పెరిగింది.
డుడుమ జలపాతం వద్ద ...
ముంచంగిపుట్టు, నవంబరు 13: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని సంగడ సమీపంలో ప్రవహిస్తున్న డుడుమ జలపాతం వద్ద సోమవారం పర్యాటకుల సందడి నెలకొంది. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో ఉమ్మడి విశాఖతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. ఇంకా ఒడిశాలోని సిమిలిగూడ, జైపూర్, కోరాపుట్, తదితర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో జలపాతం వ్యూపాయింట్ కిటకిటలాడింది. కొండల మీద నుంచి లోయలోకి జాలువారుతున్న జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు.