పడకేసిన పర్యాటకం
ABN , First Publish Date - 2023-09-27T01:13:00+05:30 IST
సహజసిద్ధ ప్రకృతి అందాలకు నెలవైన మన్యంలో పర్యాటక అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏజెన్సీలోని అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తున్నా సందర్శనీయ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు కల్పించ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వసతులు కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు మరింత మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నా ఈ ప్రాంతంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్న అపవాదు ఉంది. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏజెన్సీలో పర్యాటకంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
- అభివృద్ధిని విస్మరించిన వైసీపీ ప్రభుత్వం
- పాత ప్రాజెక్టులపై నిర్లక్ష్యం.. కొత్తవి శూన్యం
- ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తున్నా కనీస వసతులు కరువు
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా...
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
సహజసిద్ధ ప్రకృతి అందాలకు నెలవైన మన్యంలో పర్యాటక అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏజెన్సీలోని అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తున్నా సందర్శనీయ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు కల్పించ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వసతులు కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు మరింత మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నా ఈ ప్రాంతంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్న అపవాదు ఉంది. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏజెన్సీలో పర్యాటకంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఎటు చూసినా పచ్చని కొండలు, గలగల పారే సెలయేళ్లు, ఉరికే జలపాతాలు, కొండలను చుట్టిన పాములా కనిపించే ఘాట్ మార్గం, అటు అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు మొదలుకుని అక్కడికి సమీపంలోని జలపాతాలు, ఘాట్‌లోని కాఫీ తోటలు, అరకులోయ చేరుకునే వరకు కనుచూపు మేర పచ్చదనం. పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే అరకులోయలోని గిరిజన మ్యూజియం, మాడగడ వ్యూపాయింట్, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడలోని చాపరాయి, హుకుంపేట మండలంలో మత్స్యగుండం తిలకించి పర్యాటకులు పాడేరు చేరుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి చోడవరం మీదుగా పాడేరు ఘాట్ మార్గంలో ప్రయాణిస్తూ పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాలకు తరలివెళుతుంటారు.
వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం అదుర్స్
అరకులోయ సందర్శన అనంతరం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించేవి పాడేరు మండలంలోని వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలోని చె రువులవేనం ప్రాంతాలే. శీతాకాలంలో కశ్మీరు అందాలను తలదన్నేలా ప్రకృతి సౌందర్యం వంజంగిహిల్స్, కొత్తపల్లి జలపాతం, చెరువులవేనంలో దర్శనమిస్తుంది. దీంతో పిక్నిక్‌ల సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే సగటు పర్యాటకుడు ఆ మూడు ప్రదేశాలను తిలకించకుండా తిరిగి వెళ్లరంటే అతిశయోక్తి కాదు. ఆ తరువాత లంబసింగి పరిసరాల్లో స్ట్రాబెరీ తోటలు, సీలేరు జలవిద్యుత్ కేంద్రం, ధారాలమ్మ ఆలయం, యర్రవరం జలపాతాన్ని పర్యాటకులు సందర్శిస్తుంటారు.
మౌలిక సదుపాయాలు శూన్యం
ఏజెన్సీలో ఇటు బొర్రా గుహలు మొదలుకుని అటు చింతపల్లి మండలం లంబసింగి, యర్రవరం జలపాతం వరకు ఎక్కడ చూసినా కనీస సదుపాయాలు లేమితో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కటికి, రణజిల్లెడ, చాపరాయి, కొత్తపల్లి, యర్రవరం జలపాతాల్లో జలకాలాడే క్రమంలో ఆయా ప్రదేశాల్లో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సైతం కనీసం సౌకర్యాలు లేవు. అలాగే తాగునీరు, మరుగుదొడ్ల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పిక్నిక్‌ల సీజన్‌లో ప్రకృతి అందాలను తిలకించేందుకు వస్తున్నామనే భావనతో పర్యాటకులు సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదు. అయితే ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పర్యాటకాభివృద్ధికి గాని, పర్యాటక ప్రదేశాల్లో సదుపాయాల కల్పనకు గాని కనీస ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి లేకుండా పోయింది.
ఏటా పది లక్షల మంది సందర్శన
ఏజెన్సీలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు ఏటా పది లక్షల మంది మన్యాన్ని సందర్శిస్తున్నారనేది ఒక అంచనా. అంతటి ప్రాధాన్యత గల ప్రదేశాలున్నప్పటికీ పర్యాటకంగా గిరిజన ప్రాంతాన్ని ఉన్నత శిఖరానికి తీసుకువెళ్లేందుకు అధికారులుగాని, ప్రజాప్రతినిధులు గాని కృషి చేయడం లేదు. వాస్తవానికి ఏజెన్సీకి వస్తున్న పర్యాటకులు మరో ప్రాంతానికి వెళ్తే ఆయా ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. అయితే ప్రభుత్వ ప్రాధాన్యతలో పర్యాటకం లేకపోవడం, పర్యాటక శాఖకు గతంలో మంత్రిగా చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గాని, ప్రస్తుత మంత్రి ఆర్‌కే రోజా గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మన్యంలో పర్యాటకాభివృద్ధి పడకేసింది.