Share News

నేడు ఉక్కు పరిపాలనా భవనం ముట్టడి

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:20 AM

జిందాల్‌ సంస్థతో ఉక్కు యాజమాన్యం చేసుకున్న ఎంవోయూను తక్షణమే రద్దు చేసుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో మంగళవారం పరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది.

నేడు ఉక్కు పరిపాలనా భవనం ముట్టడి

జిందాల్‌తో ఎంవోయూ రద్దు చేసుకోవాలని పోరాట కమిటీ డిమాండ్‌

రేపు వెయ్యి ద్విచక్ర వాహనాలతో నగరంలోకి ర్యాలీ

ఉక్కుటౌన్‌షిప్‌, డిసెంబరు 25:

జిందాల్‌ సంస్థతో ఉక్కు యాజమాన్యం చేసుకున్న ఎంవోయూను తక్షణమే రద్దు చేసుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో మంగళవారం పరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బీఎఫ్‌)-3 విషయంలో జిందాల్‌తో ఉక్కు యాజమాన్యం ఎంవోయూ చేసుకుంది. అయితే ఈ ఎంవోయూతో స్టీల్‌ప్లాంటుకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఎంవోయూ పత్రాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 21న ఉక్కు సీఎండీ కార్యాలయం వద్ద కార్మిక నాయకులు బైఠాయించిన విషయం తెలిసిందే. జిందాల్‌తో ఉక్కు యాజమాన్యం చీకటి ఒప్పందం చేసుకుందని, స్టీల్‌ప్లాంటు ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి సంస్థలో జరిగే ప్రతి విషయం ప్రజలకు తెలియాలని కార్మిక నేతలు అంటున్నారు. జిందాల్‌తో ఎంవోయూను రద్దు చేసుకోకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు సీఎండీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. గడిచిన రెండేళ్ల నుంచి స్టీల్‌ప్లాంటును నష్టాల్లోకి నెట్టి కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితికి తీసుకువచ్చారని, ఇప్పుడు ప్లాంటు ప్రైవేటీకరణ కుట్రలో భాగంగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను జిందాల్‌ సంస్థకు ఇచ్చారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు.

రేపు వెయ్యి ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ ప్రదర్శన

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం నగరంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేసి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా బుధవారం కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ దీక్షా శిబిరం నుంచి వెయ్యి ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని, ఉక్కు కార్మికులంతా హాజరుకావాలని ఉక్కు పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు.

పోరాట కమిటీ డిమాండ్‌లు...

- జిందాల్‌తో చేసుకున్న ఎంవోయూను తక్షణమే రద్దు చేసుకోవాలి

- సెయిల్‌తో ఒప్పందం చేసుకోవాలి

- 2017 వేతన సవరణ చేయాలి

- ఉక్కు నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి

Updated Date - Dec 26 , 2023 | 01:20 AM