మా బడిలో ‘భోజనం’ లేదు
ABN , First Publish Date - 2023-03-02T01:03:19+05:30 IST
గొలుగొండ మండలం సీహెచ్. నాగాపురం పంచాయతీ పరిధి కుమారపురం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు
గతంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని కుమారపురం ఎంపీపీ పాఠశాలను మూసి.. సమీప విద్యాలయంలో విలీనం
అంత దూరం వెళ్లలేక పలువురు చదువుకు దూరం
తల్లిదండ్రులు, స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు ఇటీవల పునఃప్రారంభం
ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం అమలును విస్మరించిన అధికారులు
కృష్ణాదేవిపేట, మార్చి 1 : గొలుగొండ మండలం సీహెచ్. నాగాపురం పంచాయతీ పరిధి కుమారపురం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా దీనిని మూసివేశారు. అప్పటి వరకు ఇక్కడ చదువుతున్న పది మంది విద్యార్థులను సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న సీహెచ్. నాగాపురం పాఠశాలలో వేసేశారు. అంతదూరం వెళ్లేందుకు పిల్లలు ఇష్టపడకపోగా, తల్లిదండ్రులు సైతం పాఠశాలకు పంపేందుకు పెద్దగా సుముఖత చూపలేదు. దీంతో పిల్లలు చదువులకు దూరం అయ్యేవారు. చివరకు తల్లిదండ్రులు, స్థానిక నాయకులు కలిసి విద్యాశాఖ ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి తమ గ్రామంలో పాఠశాలను తెరిపించాలని వేడుకున్నారు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 28వ తేదీన ఈ ఎంపీపీ పాఠశాలను పునఃప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడాన్ని అధి కారులు విస్మరించారు. ప్రస్తుతం సుమారు పదిహేను మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా మధ్యాహ్నం వేళ ఇళ్లకు వెళ్లి భోజనాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఎండలు మండిపోతుండడంతో విద్యార్థులు ఆ సమయంలో వెళ్లి రావడం ఇబ్బందిగా మారింది.
ఒక్కోసారి కొందరు విద్యార్థులు మధ్యాహ్నం భోజనానంతరం పాఠశాలకు రావడం ఆలస్యం జరుగుతోంది. అంతేకాకుండా విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సమయాల్లో వారివారి తల్లిదండ్రులు పొలం పనులు, ఉపాధి పనులు, ఇతరత్రా పనులపై బయటకు వెళుతున్నారు. వారురావడం ఆలస్యం అవుతుండడంతో కొందరు మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేయకుండానే తరగతులకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలో తక్షణమే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు.