వైసీపీ బస్సు యాత్ర ఉందని రాత్రికి రాత్రి సీసీ రోడ్డు !
ABN , First Publish Date - 2023-11-20T00:42:21+05:30 IST
రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లు సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందునా పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం పరిధిలో రోడ్లు మరింత అధ్వానంగా ఉన్నాయి.

అచ్యుతాపురం, నవంబరు 19: రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లు సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందునా పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం పరిధిలో రోడ్లు మరింత అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు సంగతి చెప్పనవసరం లేదు. ఈ రోడ్డు దుస్థితిపై టీడీపీ, జనసేన శనివారం భారీ స్థాయిలో ఆందోళన చేశారు. ప్రజలు నాలుగేళ్లుగా రోడ్ల పరిస్థితి బాగో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఇటు అధికార పార్టీ నాయకులు గాని, అటు ప్రభుత్వాధికారులు గాని పట్టించుకోలేదు. కానీ సోమవారం సాయంత్రం అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ వద్ద వైసీపీ బస్సు యాత్ర ఏర్పాటుచేసింది. ఈ సమావేశ ప్రాంతానికి అచ్యుతాపురం-ఎలమంచిలి ప్రధాన రహదారి నుంచి మండల కాంప్లెక్స్ రోడ్డు గుండా అమాత్యుల వాహనాలు వెళ్లాలి. ఇందు కోసం ఆదివారం రాత్రి యుద్ధప్రాతిపదికన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గతంలో ఇది సింగిల్ రోడ్డుగా ఉండేది. ఇటీవలే అచ్యుతాపురం పంచాయతీ నిధులతో విస్తరించి సీసీ రోడ్డు వేశారు. అయినా రోడ్డు మరింత బాగుండాలనే ఉద్దేశంతో మరల రోడ్డుపై మళ్లీ రోడ్డు వేస్తున్నారు. అలాగే సోమవారం సాయంత్రం రెండు గంటలకు డ్వాక్రా సంఘాల సభ్యులంతా రావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.