అప్పన్న భక్తులకు అన్న ప్రసాదం కరువు

ABN , First Publish Date - 2023-03-31T01:26:19+05:30 IST

సింహాచలం దేవస్థానం అధికారులు ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో పండగరోజు వందలాది మంది భక్తులు అన్న ప్రసాదం లభించక ఆకలితో వెనుతిరగాల్సి వచ్చింది.

అప్పన్న భక్తులకు అన్న ప్రసాదం కరువు

ఆకలితో వెనుతిరిగిన వందలాది మంది...

సదరు విభాగం అధికారులకు తగిన ప్రణాళిక లేకపోవడమే కారణం

సింహాచలం, మార్చి 30:

సింహాచలం దేవస్థానం అధికారులు ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో పండగరోజు వందలాది మంది భక్తులు అన్న ప్రసాదం లభించక ఆకలితో వెనుతిరగాల్సి వచ్చింది. దైవ దర్శనానికి వచ్చిన భక్తులెవ్వరూ ఆకలితో వెళ్లకూడదని, అందుకు తగ్గట్టుగా నిత్యాన్న ప్రసాద పథకం కింద అపరిమితంగా భోజనాలను వండి వడ్డిస్తామంటూ గత ఏడాది డిసెంబరులో దేవదాయ శాఖా మంత్రి నృసింహవనంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ప్రకటన చేశారు. అయితే సింహగిరిపై గురువారం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల కల్యాణం చూసేందుకు, దాంతోపాటు సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే అన్న ప్రసాద విభాగపు అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా సాధారణ రోజుల్లో మాదిరిగా రెండు వేల మందికి మాత్రమే అన్న ప్రసాదాన్ని తయారుచేశారు. దానిని సుమారు 2,700 మందికి అందజేయగలిగారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అన్న ప్రసాదం కోసం వచ్చిన భక్తులను భోజనం లేదంటూ అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డులు వెనక్కి పంపేశారు. దాంతో పలువురు భక్తులు ఆకలితో అసంతృప్తిగా వెనుతిరగక తప్పలేదు.

Updated Date - 2023-03-31T01:26:19+05:30 IST