టీడీపీ అభ్యర్థికి 34,936 ఓట్ల మెజారిటీ

ABN , First Publish Date - 2023-03-19T01:20:49+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై 34,936 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

టీడీపీ అభ్యర్థికి 34,936 ఓట్ల మెజారిటీ

బీజేపీ నుంచి చిరంజీవిరావుకు 3,959 ద్వితీయ ప్రాధాన్య ఓట్లు, సుధాకర్‌కు 1,414...

పీడీఎఫ్‌ నుంచి ఒకరికి 6,645, మరొకరికి 2,025 ఓట్లు

విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై 34,936 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తొలి ప్రాధాన్య ఓట్లలో చిరంజీవిరావుకు 82,957 ఓట్లు, సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు వచ్చాయి. దీంతో 28,208 ఓట్ల ఆధిక్యం లభించినట్టయ్యింది. అయితే మొత్తం 2,89,214 ఓట్లకుగాను 2,01,335 మంది (పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి) పోలవ్వగా...అందులో 12,318 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 1,89,017 ఓట్లలో 50 శాతం+1 (అంటే 94,509) ఎక్కువ వస్తేనే విజయం సాధించినట్టు. మొదటి ప్రాధాన్య ఓట్లలో విజయానికి అవసరమైనన్ని ఓట్లు ఎవరికీ లభించకపోవడంతో అధికారులు శుక్రవారం రాత్రి ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపును చేపట్టారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 11,551 ఓట్లు లభిస్తే విజయం సాధించినట్టవుతుంది. పోటీ చేసిన 37 మందిలో 34 మందికి డిపాజిట్లు దక్కలేదు. వారిలో 33 మందికి కలిసి సుమారు నాలుగు వేల ఓట్లు వచ్చాయి. అందులో టీడీపీ అభ్యర్థికి 947 ఓట్లు లభించాయి. ఆ తరువాత బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు వచ్చిన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. టీడీపీ అభ్యర్థికి 3,959 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 1,414 ఓట్లు వచ్చాయి. అప్పటికీ గెలుపునకు సరిపడా (కోటా ఓట్లు) రానుందున పీడీఎఫ్‌ అభ్యర్థిని కోరెడ్ల రమాప్రభకు వచ్చిన ఓట్లలో 15,067 బ్యాలెట్లను తీసి ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అందులో తెలుగుదేశం అభ్యర్థి చిరంజీవిరావుకు 6,645 ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు. కాగా వైసీపీ అభ్యర్థికి 2,025 ఓట్లు వచ్చాయి. మొదటి, ద్వితీయ ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు 94,509 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి 59,673 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు 34,936 ఓట్ల మెజారిటీ వచ్చింది.

Updated Date - 2023-03-19T01:20:49+05:30 IST