వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలు
ABN , First Publish Date - 2023-05-02T00:54:54+05:30 IST
వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అన్ని రంగాల్లో వెనుకబడిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపణ
ఎలమంచిలిలో జగనాసుర అవినీతిపై నిరసన ర్యాలీ
ఎలమంచిలి, మే 1: వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అన్ని రంగాల్లో వెనుకబడిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. ఎలమంచిలి పట్టణంలోని టీడీపీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ప్రధాన రోడ్డుపై సోమవారం టీడీపీ నేతలు జగనాసుర అవినీతిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ప్రజా వ్యతిరేక పాలన సాగించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసేలా పాలన సాగించి అభివృద్ధి కుంటుపడేలా చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, నాయకులు కొఠారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, ఎంపీటీసీ నీరుకొండ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. కాగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రాంతీయ కార్యాలయం వద్ద సోమవారం భారీగా పోలీసులు మోహరించారు.