ఓటర్ల శిబిరాలకు స్పందన అంతంతమాత్రమే
ABN , First Publish Date - 2023-12-03T01:27:58+05:30 IST
కొత్తగా ఓటు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించేందుకుగాను శనివారం జిల్లావ్యాప్తంగా 1,941 పోలింగ్ బూత్‌లలో ఏర్పాటుచేసిన శిబిరాలకు అంతంతమాత్రంగానే స్పందన లభించింది.
తొలిరోజు ఫారం-6,7,8 కింద 8,147 దరఖాస్తులు రాక
కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు నేడు కూడా అవకాశం
విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
కొత్తగా ఓటు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించేందుకుగాను శనివారం జిల్లావ్యాప్తంగా 1,941 పోలింగ్ బూత్‌లలో ఏర్పాటుచేసిన శిబిరాలకు అంతంతమాత్రంగానే స్పందన లభించింది. శని, ఆదివారాలు శిబిరాలు నిర్వహిస్తామని ముందుగానే అధికారులు ప్రకటించారు. అయితే తొలిరోజు పెద్దగా ఓటర్లు రాలేదు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ బీఎల్వోలు, ఇతర సిబ్బంది ఉన్నా కొన్నిచోట్ల మాత్రమే ఓటర్లు వచ్చి ముసాయిదా జాబితాల్లో పేర్లు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకున్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తులు సమర్పించారు. 2019లో జగదాంబ జంక్షన్‌లోని సెయింట్ ఆంధోని పాఠశాలలో ఓటు వేసిన పందిమెట్టకు చెందిన రామారావు ఓటు ప్రస్తుత ముసాయిదా జాబితాలో లేకపోవడంతో కొత్తగా దరఖాస్తు ఫారం తీసుకున్నారు. కొన్నిచోట్ల చనిపోయిన వారి వివరాలు చెప్పినా జాబితా నుంచి తొలగించలేదని, మరికొన్నిచోట్ల జాబితాలో తప్పులు సవరించ లేదని శిబిరాలకు వచ్చినవారు ఫిర్యాదు చేశారు. తొలిరోజు 1,942 పోలింగ్ బూత్‌లలో 857 మంది బీఎల్‌వోలు హాజరుకాగా ఫారం 6,7,8 కలిపి 8,147 దరఖాస్తులు వచ్చాయి. ఓటు నమోదుకు ఫారం-6 కింద 3,825, తొలగింపులకు 1,206, సవరణలకు 3,116 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా 166 మంది అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులు, 679 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు పోలింగ్ బూత్‌లను తనిఖీ చేశారు. కాగా ఆదివారం కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు శిబిరాలు కొనసాగుతాయి.