బొమ్మ చూపించారు

ABN , First Publish Date - 2023-03-31T01:18:26+05:30 IST

జీ-20 సన్నాహాక సదస్సు కోసం జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బొమ్మ చూపించారు

జీ-20 పేరిట రూ.లక్షలు స్వాహా

తెన్నేటి పార్కు, సీతకొండ వద్ద రాళ్లపై బొమ్మలు వేయడానికి రూ.28.9 లక్షలు వ్యయం!

వాస్తవ ఖర్చు కంటే నాలుగు రెట్లు అధికంగా అంచనాలు

17 శాతం తక్కువకు టెండర్‌ వేసిన కాంట్రాక్టర్‌ను కాదని వేరొకరితో పనులు

చక్రం తిప్పిన టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని ఒక అధికారి

ఆ పనులకు రూ.ఏడెనిమిది లక్షలకు మించి ఖర్చు కాదనే అభిప్రాయం

జీ-20 పనులపై విజిలెన్స్‌ విచారణకు విపక్షాలు, మేధావుల డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీ-20 సన్నాహాక సదస్సు కోసం జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు పాటించామని చెప్పుకోవడానికే అన్నట్టు టెండర్లు పిలిచిన అధికారులు తమ అస్మదీయులతో పనులు జరిపించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యతాలోపం, టెండర్లలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌తోపాటు రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఈఏఎస్‌ శర్మ వంటివారు డిమాండ్‌ చేస్తున్నారు.

జీ-20 సదస్సు కోసం సుమారు రూ.130 కోట్లతో నగర అభివృద్ధి, సుందరీకరణ పనులు చేసినట్టు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఆయా పనులకు ప్రతిపాదనలు తయారీ, టెండర్లు పిలవడం, పనులు పూర్తిచేయడం వంటివన్నీ కేవలం రెండు, మూడు నెలల్లోనే జరిగిపోయాయి. తక్కువ సమయంలో పనులను పూర్తిచేయాల్సి రావడంతో దాదాపు అన్నింటికీ షార్ట్‌ టెండర్‌ పిలిచారు. కానీ బిడ్‌లు తెరవకుండానే పనులను అధికారులు తమకు అస్మదీయులైన కాంట్రాక్టర్లకు పంచేశారు. అధికారులే నిబంధనలకు విరుద్ధంగా తమకు పనులు కట్టబెట్టడాన్ని ఆసరాగా తీసుకున్న కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించారు. తూతూమంత్రంగా పనులను చేశారు. దీనివల్ల అవన్నీ ఎంతోకాలం ఉండవని అధికారులు సైతం అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

ఇదిలావుండగా బీచ్‌రోడ్డులోని తెన్నేటిపార్క్‌, సీతకొండ వద్ద బొమ్మలు వేసే పనుల్లోనూ అక్రమాలు జరిగాయంటూ గురువారం జనసేన పార్టీకి చెందిన 22వ వార్డు కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. తెన్నేటిపార్క్‌ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న రాళ్లపై ఎనిమిది చిత్రాలను వేసేందుకు రూ.12.38 లక్షలతో, సీతకొండ వద్ద మరికొన్ని చిత్రాలు వేసేందుకు రూ.16.32 లక్షలతో ఈనెల 21న టౌన్‌ప్లానింగ్‌ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ అధికారులు షార్ట్‌ టెండర్లు పిలిచారు. ఆయా పనులు చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లు పోటీ పడగా, అందులో ఒకరు 17 శాతం తక్కువకు కోట్‌ చేశారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి చెందిన ఒక అధికారి సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్‌ చేసి ‘మీకు టెండర్‌ దక్కినప్పటికీ పనులను మేము వేరొకరితో చేయిస్తాం. కాబట్టి, మీ పేరున బిల్లు వచ్చినప్పుడు డ్రా చేసి మాకు ఇచ్చేయండి. అందుకుగానూ మీకు రూ.రెండు లక్షలు ఇస్తాం’ అని చెప్పారు. అందుకు సదరు కాంట్రాక్టర్‌ ససేమిరా అన్నట్టు తెలిసింది. దీంతో టెండర్‌ను పక్కన పెట్టేసిన అధికారులు తాము అనుకున్న వ్యక్తులతో చిత్రాలను వేయించారని సమాచారం. అధికారులకు ఎలాంటి ప్రత్యేక ఆసక్తి లేకపోతే కాంట్రాక్టర్‌ను పని వదులుకోవాలని, అందుకు ప్రతిగా కొంత మొత్తం ఇస్తామని ఆఫర్‌ చేయాల్సి అవసరం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జీ-20 సదస్సు పేరుతో రాళ్లపై వేసిన చిత్రాలకు అయ్యే ఖర్చు గురించి ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగానికి చెందిన ఒక ప్రొఫెసర్‌తో మాట్లాడగా నియాన్‌, ఎమల్షన్‌ పెయింట్స్‌ ఉపయోగించాల్సి ఉంటుందని, మెటీరియల్‌ ఖర్చుతోపాటు ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు ఇచ్చే మొత్తం కలిపి లెక్కేసుకుంటే గరిష్ఠంగా రూ.ఏడెనిమిది లక్షలు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ లెక్కన రాళ్లపై చిత్రాల పేరిట భారీ అవినీతి జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుండగా జీ-20 పేరుతో జీవీఎంసీ అధికారులు రూ.150 కోట్లు దుర్వినియోగం చేశారని, పేదల సంక్షేమాన్ని విస్మరించి, అనవసరంగా ఖర్చు చేయడం దారుణమని, దీనిపై విజిలెన్స్‌ విచారణ జరపాలంటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

Updated Date - 2023-03-31T01:18:26+05:30 IST