భూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి
ABN , First Publish Date - 2023-09-22T00:55:24+05:30 IST
మండలంలోని ఎం.కె.పట్నం శివారు ఛటర్జీపురంలో గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో బుధవారం కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, అతని అనుచరులు నరికివేసిన జామ, అరటి తోటలను గురువారం ఉదయం తహసీల్దార్ వరహాలు, ఎస్‌ఐ నాగకార్తీక్ పరిశీలించారు.
ఛటర్జీపురం గిరిజనులకు తహసీల్దార్, ఎస్‌ఐ సూచన
వివాదాస్పద భూములను పరిశీలించిన అధికారులు
రోలుగుంట, సెప్టెంబరు 21: మండలంలోని ఎం.కె.పట్నం శివారు ఛటర్జీపురంలో గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో బుధవారం కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, అతని అనుచరులు నరికివేసిన జామ, అరటి తోటలను గురువారం ఉదయం తహసీల్దార్ వరహాలు, ఎస్‌ఐ నాగకార్తీక్ పరిశీలించారు. సాగుదారులతో సమావేశమై వివరాలు సేకరించారు. తమ తాత ముత్తాతల నుంచి ఈ భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, గతంలో ఆన్‌లైన్‌లో సాగుదారులుగా తమ పేర్లు ఉండేవారని, కానీ కొంతకాలం క్రితం తొలగించారని గిరిజనులు తెలిపారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. భూములను మీరు సాగు చేసుకుంటున్నప్పటికీ రికార్డులు వారా నూకరాజు, మరికొందరి పేర్ల మీద ఉన్నాయని అందువల్ల వివాదాలకు పోకుండా ఇరువర్గాలు కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ భూములపై కోర్టులో కేసు నడుస్తున్నదని చెప్పారు. బుధవారం జరిగిన కొట్లాటకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన 10 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.