ఆహారం... అపహాస్యం!
ABN , First Publish Date - 2023-06-26T01:05:11+05:30 IST
ఆహారాన్ని వృథా చేయడం ఇటీవల నిత్యకృత్యమైపోయింది.
ఆహారం విలువ గుర్తెరగని జనం
నిత్యం వృథాగా పడేస్తున్న నగర వాసులు
రోజుకు సుమారు 2 వేల కిలోల అన్నం చెత్తకుప్పలోకి
కనీసం 12 వేల మందికి ఒక పూట భోజనమది
ఆకలితో అలమటిస్తున్న వేలాది మందికి దక్కని వైనం
చైతన్యం రాకుంటే భవిష్యత్తు తరాలకు ముప్పే
ఎంవీపీ కాలనీ, జూన్ 25:
ఆహారాన్ని వృథా చేయడం ఇటీవల నిత్యకృత్యమైపోయింది. అవసరం లేకున్నా వడ్డించుకోవడం... తినలేకపోతున్నానంటూ బయట పారవేయడం అలవాటైపోయింది. హోటళ్లు, ఫంక్షన్లు, అన్నదానాలు, చివరకు ఇళ్లలోనూ ఈ పరిస్థితి రోజూ కనిపిస్తోంది. మనం పారేసే అన్నం ఎంతో మంది పేదల కడుపు నింపాల్సిందనే విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదు. నగరంలో ప్రతిరోజూ ఇలా వృథాగా బయట పడేస్తున్న ఆహారం సుమారు 12 వేల మందికి ఒకపూట కడుపునింపే స్థాయిలో ఉంటోంది.
నగరంలో హోటళ్లు, నిత్యాన్నదానాలు, మెస్‌లు, వసతిగృహాలు, పార్లర్లు, రెస్టారెంట్లు ఇలా ప్రతిచోట అన్నం వృథా అవుతోంది. చివరకూ మన ఇళ్లలోనూ ఇదే పరిస్థితి. ఏ స్థాయిలో అంటే కనీస లెక్కలో ప్రతిరోజూ 1600 నుంచి రెండు వేల కిలోల బియ్యం అన్నం రూపంలో వృథాగా చెత్తలో కలిసిపోతోంది. అంటే దాదాపు పది వేల నుంచి పన్నెండు వేల మందికి ఒక పూటకు సరిపడా భోజనం ఒక్కరోజులోనే నేలపాలవుతోంది.
రైతు కష్టానికి విలువెప్పుడు?
రైతు నారు పోసినప్పటి నుంచి బియ్యంగా మారి మన ఇంటికి రావడానికి మధ్య ఎన్నో దశలు ఉంటాయి. అంతటి విలువైన అన్నాన్ని రుచించలేదనో, ఎక్కవైందనో వృథాగా పడేస్తున్నారు. ఇలా పక్కన పడేస్తున్న అన్నం వేల మంది కడుపులు నింపాల్సింది. కానీ నిర్లక్ష్యం, ఆలోచనారాహిత్యం, అన్నం విలువ తెలియని మనం...నాలుగు మెతుకులేగా అని వదిలేస్తున్నాం.
ఇక్కడే ఎక్కువ వృథా...
సరదాగా హోటళ్లకు వెళ్లేవారు కొందరు. అవసరార్థం వెళ్లేవారు కొందరు. కారణం ఏదైనా, తిన్నదానికంటే ఎక్కువ ప్లేట్లలో వడ్డించుకోవడం... డబ్బు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ...మనది కాదు కదా అని వదిలేయడం. వెరసి వదిలేసిన ప్రతి గిన్నెలోని నాలుగు మెతుకులే ఇంతితై అన్నట్టు వేల కిలోల అన్నం చెత్తలో కలిసిపోతోంది. హోటళ్లకు వెళ్లేవారు అంచానాకు సరిపడా ఆర్డరు ఇవ్వలేక, అధికంగా ఇవ్వడం, తిన్నంత తిని వృథాగా వదిలేయడం రివాజుగా మారుతోంది. ఇది నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి గృహాలు, పార్లర్లు, నిత్యాన్నదానాల్లో నిత్యం కనిపించే సత్యం. అంతే కాదు ఇళ్లల్లో కూడా వండిన అన్నం మిగిలిపోతే... దానిని పేదలకు అందివ్వడమో... లేక మరో పూటకు ఇంకో రకంగా సిద్ధం చేయడం మానేశారు. నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో పారేస్తున్నారు.
మహా నగరంలో ఇదీ లెక్క!
మహానగరంలోని ప్రతి ప్రాంతంలోనూ చిన్నపాటి హోటళ్లు వెయ్యికి పైగా ఉన్నాయి. మధ్యస్థ హోటళ్లు నాలుగు వందల వరకూ ఉండగా పెద్దవి మరో 300, స్టార్ హోటళ్లు ఓ ముప్పై ఉన్నాయి. 300కు పైగా కేటరింగ్ సంస్థలు వ్యాపారం చేస్తున్నాయి. విద్యార్థుల కోసం కాలేజీ వసతి గృహాలు, ఆలయాల్లో నిత్యాన్నదానాలు, పేయింగ్ గెస్ట్ గృహాలు మరెన్నో. వీటిలో కనీస లెక్క తీసుకుంటే... చిన్నపాటి హోటళ్లలో రోజుకు కేవలం పావు కిలో బియ్యం వృథా అయినా సుమారు 250 కిలోలు, మధ్యస్థం హోటళ్లలో అర కిలో చొప్పున 200 కిలోలు, పెద్ద హోటళ్లలో కిలో చొప్పున చూసినా 300 కిలోలు, స్టార్ హోటళ్లలో రెస్టారెంట్లు, రూంలలో అయిదు కిలోల చొప్పున చూసినా కనీసం 150 కిలోలు, కేటరింగ్ సంస్థలను పరిగణలోకి తీసుకుంటే రోజుకు కేవలం 50 ఫంక్షన్లు జరిగినా పది కిలోల చొప్పున 500 కిలోలు... ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే సుమారు 2వేల కిలోల బియ్యం వృథా అవుతున్నాయి. ఇవి కాక వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో క్యాంటీన్లు వంటివి ఉద్యోగుల కోసం ఉన్నాయి. కిలో బియ్యం ఆరుగురు తింటారనుకున్నా సుమారు 12 వేల మంది ఒక పూట భోజనం నిత్యం వృథాగా పోతోంది. ఇవికాక కూరల వృథా ఆలోచిస్తే అమ్మో అనిపించక మానదు.