జీపీఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం
ABN , First Publish Date - 2023-09-26T00:47:09+05:30 IST
గ్యారంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)కు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీసీపీఎస్‌ఈఏ, ఎఫ్‌ఏపీటీఓ (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
అనకాపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్యారంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)కు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీసీపీఎస్‌ఈఏ, ఎఫ్‌ఏపీటీఓ (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రధాన గేటు ఎదురుగా కొద్దిసేపు బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని, జీపీఎస్ వద్దు, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో అనకాపల్లి జిల్లా ఛైర్మన్ గొంది చినబ్బాయి మాట్లాడుతూ, జీపీఎస్‌ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం బలవంతంగా అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు. పెన్షన్ అంటే ఉద్యోగికి రిటైర్మెంట్ తరువాత ప్రభుత్వం చెల్లించే భరణం లేదా జీవన భృతి అని, కానీ ఉద్యోగుల నుంచి చందా వసూలు చేసి పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డీఏలు, పీఆర్‌సీలు వర్తించని జీపీఎస్ విధానం అవసరం లేదన్నారు. ప్రభుత్వానికి జీపీఎస్‌పై అంతగా ఆసక్తి ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అమలు చేసుకోవాలని సూచించారు.
ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల అప్పలరాజు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రతిపక్షంలో వున్నప్పుడు పలుమార్లు హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఓపీఎస్‌కు బదులు జీపీఎస్‌ను తెరమీదకు తెచ్చి ఉద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టిను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ వై.సుధాకర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్.సన్యాసినాయుడు, కోఛైర్మన్ సాయిప్రసాద్, నాయకులు ప్రేమ్‌కుమార్, శ్రీను, ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సతీశ్, నాయకులు సూర్యప్రకాశ్, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ నాయకుడు అమరాన త్రినాథ, డీటీఎఫ్ నాయకుడు టి.మధు, యూటీఎఫ్ నాయకురాలు జి.గాయత్రి, పీఆర్‌టీయూ నాయకులు గోపీనాథ్, పెద్దినాయుడు, తదితరులు ధర్నా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.