ముసాయిదా ఓటర్ల జాబితా వచ్చే 17న విడుదల
ABN , First Publish Date - 2023-09-07T00:22:27+05:30 IST
ఇంటింటా ఓటర్ల సర్వే పూర్తికావడంతో ఆన్‌లైన్‌లో వివ రాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
ఇంటింటా ఓటర్ల సర్వే పూర్తికావడంతో ఆన్‌లైన్‌లో వివ రాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఓటర్ల తనిఖీ సందర్భంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఓటు నమోదుకు 46,476 దరఖాస్తులు (ఫారం-6) రాగా ఇప్పటివరకు 26,273 ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. అలాగే మృతిచెందిన ఓటర్లు, శాశ్వతంగా నగరం నుంచి వెళ్లిపోయిన వారి వివరాలకు సంబంధించి 39,733 దరఖాస్తులు (ఫారం-7) రాగా 15,208 అప్‌లోడ్ చేశారు. అదేవిధంగా తప్పుల సవరణ, చిరునామా మార్పు కోసం 66,478 దరఖాస్తులు (ఫారం-8) రాగా 37,332 ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదుచేశారు.ఇవికాకుండా కొందరు ఓటర్లు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్నందున వాటికి సంబంధించి ఫారాలను తీసుకుని వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా ఈనెల 25వ తేదీలోగా పూర్తిచేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని బీఎల్‌వోలకు అధికారులు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఏఈ ఆర్వోలతో బుధవారం జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆన్‌లైన్ నమోదు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా ఈనెల 25వ తేదీలోగా ఓటర్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేసిన తరువాత బూత్‌ల వారీగా జాబితాలు తయారు చేయనున్నారు. వచ్చే నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.