కోరి ఆర్గానిక్స్‌ ప్రమాదం

ABN , First Publish Date - 2023-09-27T01:10:40+05:30 IST

ఫార్మాసిటీలోని కోరి ఆర్గానిక్స్‌ పరిశ్రమలో మంగళవారం ప్రమాదం జరిగింది. కె.రాజారావు(35) అనే కాంట్రాక్టు కార్మికుడు రియాక్టర్‌లో పడి మృతిచెందాడు.

కోరి ఆర్గానిక్స్‌ ప్రమాదం
మృతిచెందిన రాజారావు (ఫైల్‌ఫొటో)

రియాక్టర్‌లో పడి కార్మికుడి మృతి

పరవాడ, సెప్టెంబరు 26: ఫార్మాసిటీలోని కోరి ఆర్గానిక్స్‌ పరిశ్రమలో మంగళవారం ప్రమాదం జరిగింది. కె.రాజారావు(35) అనే కాంట్రాక్టు కార్మికుడు రియాక్టర్‌లో పడి మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోరి ఆర్గానిక్స్‌లోని ప్రొడక్షన్‌ బ్లాకులో రెండు రోజుల నుంచి రియాక్టర్‌లను క్లీనింగ్‌ చేస్తున్నారు. మంగళవారం కాంట్రాక్టు కార్మికుడు కింతాడ రాజారావుతోపాటు సేఫ్టీ ఇన్‌చార్జి ప్రసాద్‌, కెమిస్ట్‌ వెంకటేశ్‌ కలిసి ఓ రియాకర్ట్‌ వద్ద బఫెన్స్‌ ఫిట్‌ చేసే పనులు నిర్వహిస్తున్నాను. రాజారావును సేఫ్టీ బెల్టు సాయంతో రియాక్టర్‌లోకి దించారు. యాంగ్యులర్‌ ఫిట్‌ చేసే పనిలో ఉండగా ప్రమాదవశాత్తూ కాలు జారడంతో రియాక్టర్‌లోకి పడిపోయాడు. లోపల ఉన్న బఫెన్స్‌ తలకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాజువాకలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 3.30 గంటల సమయంలో మృతిచెందాడు. ఇతని స్వస్థలం చోడవరం మండలం కన్నంపాలెం. రాజారావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్లుగా కోరి ఆర్గానిక్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. పరవాడ ఇన్‌చార్జి డీఎస్పీ పి.శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. కాగా కోరి ఆర్గానిక్స్‌ పరిశ్రమలో మృతిచెందిన కాంట్రాక్టు కార్మికుడు కింతాడ రాజారావు కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-09-27T01:10:40+05:30 IST