కలగానే కల్యాణ మండపం నిర్మాణం

ABN , First Publish Date - 2023-01-26T00:31:47+05:30 IST

బలిఘట్టం ఉత్తరవాహిని తీరంలో ఉన్న సత్యనారాయణస్వామి ఆలయం వద్ద చేపట్టిన కల్యాణ మండపం నిర్మాణం నాలు గేళ్లుగా అసంపూర్తిగా ఉంది. దీంతో పేద, మధ్యతరగతి వర్గాలు పెళ్లిళ్లు జరిపించుకోవడానికి వీలు లేకుండా ఉంది.

కలగానే కల్యాణ మండపం నిర్మాణం
అసంపూర్తిగా ఉన్న కల్యాణ మండపం

నాలుగేళ్ల క్రితం నిలిచిన నిర్మాణ పనులు

వైసీపీ అధికారంలోకి వచ్చాక బకాయి బిల్లుల ఊసెత్తకపోవడంతో కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్‌

సత్యదేవుని సన్నిధిలో పెళ్లిళ్లు చేయాలనుకున్న పేదల కోరిక నెరవేరని వైనం

నర్సీపట్నం, జనవరి 25 : బలిఘట్టం ఉత్తరవాహిని తీరంలో ఉన్న సత్యనారాయణస్వామి ఆలయం వద్ద చేపట్టిన కల్యాణ మండపం నిర్మాణం నాలు గేళ్లుగా అసంపూర్తిగా ఉంది. దీంతో పేద, మధ్యతరగతి వర్గాలు పెళ్లిళ్లు జరిపించుకోవడానికి వీలు లేకుండా ఉంది. సత్యదేవుని ఆలయం వద్ద వివాహాలు చేయా లన్న వారి కోరిక నెరవేరడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మునిసిపాలిటీ పరిధిలోని 19వ వార్డు బలిఘట్టం ఉత్తరవాహని వద్ద కల్యాణ మండపం అవసరమని గుర్తించి అప్పటి మంత్రి అయ్యన్న పాత్రుడు మంజూరు చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ గ్రాంట్‌ రూ.75 లక్షల అంచనా వ్యయంతో 2017 డిసెంబరు 23వ తేదీన కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజుతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించారు. కల్యాణ మండ పంలో ఏసీ హాలు, వెయ్యి మందికి సరిపడా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించి పిల్లర్లు, లింటల్‌ వరకు గోడలు కట్టారు. పైకప్పుకి రేకులు అమర్చడానికి వీలుగా ఇను ప పైపులు ఏర్పాటు చేశారు. ఈ పనుల కోసం కాం ట్రాక్టర్‌ రూ.63 లక్షల వరకు ఖర్చు చేశారు. టీడీపీ ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్‌కి మొదటి విడత బిల్లు రూ.10 లక్షలు మంజూరు చేసింది. రెండో సారి మరో రూ.17 లక్షలకు బిల్లు పెడితే మంజూరు కాలేదు. అయినా కాంట్రాక్టర్‌ పనులు ఆపకుండా రూఫ్‌ లెవల్‌ వరకు నిర్మాణం చేపట్టారు. అయితే ఆ తరువాత బిల్లుల మంజూరులో జాప్యం జరి గింది. కాగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక బిల్లు బకాయిల గురించి పట్టించు కోవడం లేదని కాంట్రాక్టర్‌ నాగార్జునరెడ్డి వాపోతు న్నారు. తాను చేసిన పనులకు రూ.50 లక్షల వరకు బిల్లు పెండింగ్‌లో ఉందని, దీని కోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినట్టు ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలి పారు.

నెరవేరని లక్ష్యం

శ్రీసత్యనారాయణస్వామి సన్నిధిలో కల్యాణ మండపం నిర్మిస్తే వివాహాలు చేసుకోవడానికి ప్రయోజనంగా ఉంటుందని అప్పట్లో అయ్యన్నపాత్రుడు భావించారు. పేద, మధ్య తరగతి ప్రజలు అన్నవరం సత్యనారాయణస్వామి వద్దకు వెళ్లకుండా ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుంటారని అనుకున్నారు. భారీ కల్యాణ మండపం నిర్మించాలన్న లక్ష్యం గొప్పదే కానీ కార్యరూపం దాల్చలేదు. ఎందరికో ఉపయోగపడాల్సిన కల్యాణ మండపం మొండి గోడలతో దర్శనమిస్తున్నది. ప్రభుత్వం నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని పలువురు కోరుతున్నారు. దీనిపై పీఆర్‌ జేఈ నర్సింగరావుని వివరణ కోరగా కాంట్రాక్టర్‌కి బిల్లు చెల్లించాల్సి ఉందన్నారు. చేసిన పనులకు బిల్లు రావడం, చేపట్టాల్సిన పనులకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Updated Date - 2023-01-26T00:31:47+05:30 IST