Share News

నమ్మించి మోసగించిన సీఎం

ABN , First Publish Date - 2023-12-11T01:15:03+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీపీఎస్‌ ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని ఏపీ సీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ఆరోపించారు. ఆదివారం అనకాపల్లిలో నిర్వహించిన సీపీఎస్‌ ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగుల ఓట్ల కోసం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా అమలు చేయలేదని అన్నారు.

నమ్మించి మోసగించిన సీఎం
గుండు చేయించుకుంటున్న సీపీఎస్‌ ఉద్యోగి

నాడు ఓట్ల కోసమే సీపీఎస్‌ రద్దు హామీ

అధికారంలోకి వచ్చి నాలుగురేళ్లయినా అమలు చేయలేదు

జీపీఎస్‌ పేరుతో ఉద్యోగుల గొంతు కోసే ప్రయత్నం

ఏపీ సీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ధ్వజం

సీపీఎస్‌ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ

తుమ్మపాల (అనకాపల్లి), డిసెంబరు 10 : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీపీఎస్‌ ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని ఏపీ సీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ఆరోపించారు. ఆదివారం అనకాపల్లిలో నిర్వహించిన సీపీఎస్‌ ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగుల ఓట్ల కోసం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా అమలు చేయలేదని అన్నారు. పైగా జీపీఎస్‌ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చి తడి గుడ్డతో ఉద్యోగుల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న సీపీఎస్‌ ఉద్యోగులను శత్రువులుగా పాలకులు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపూరితమైన జీసీఎస్‌ విధానాన్ని సీపీఎస్‌ ఉద్యోగుల నెత్తిన రుద్ధడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము మొత్తాన్ని కాజేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చేతనైతే సీపీఎస్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీ సీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఉద్యోగులకు ఎటువంటి హామీలు ఇవ్వకుండానే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాయని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు మొసలి కన్నీరు కార్చి అధికారం చేపట్టిన తర్వాత మాయమాటలతో సీపీఎస్‌ ఉద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న మూడున్నర లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు, వారి కుటుంబాలు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి తీరు మార్చుకుని సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేయకుంటే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఉద్యోగులు గుండు చేయించుకుని, భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నాయకులు సీఎం దాసు, గూనూరు శ్రీను, సింగవరపు యల్లయ్య, చుక్కా గణపతి, ఎం.రామారావు, ఎం.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T01:15:05+05:30 IST