నగరం చెత్తమయం
ABN , Publish Date - Dec 30 , 2023 | 01:25 AM
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉండడంతో నగరం చెత్తమయంగా మారింది.
వారం రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే...
పేరుకుపోయిన కుప్పలు
దుర్గంధం వెదజల్లుతుండడంతో పరిసర ప్రాంతాల వాసుల ఇబ్బందులు
దిగజారుతున్న పారిశుధ్యం
సమ్మెలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉండడంతో నగరం చెత్తమయంగా మారింది. గత ఆరు రోజులుగా చెత్త సేకరణ, తరలింపు నిలిచిపోవడంతో ఎక్కడిక్కడ చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి.
జీవీఎంసీ పరిధిలో ప్రతిరోజూ 6,500 మంది కార్మికులు పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తుంటారు. ప్రధాన రహదారులతోపాటు వీధిరోడ్లు శుభ్రం చేయడం, వాహనాలతో ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరించి సమీపంలోని మినీ సూయజ్‌ఫారాలకు తరలించడం, డ్రైనేజీల్లో పూడికతీయడం వంటి పనులు చేస్తుంటారు. వీరిలో వెయ్యి మంది శాశ్వత ఉద్యోగులు కాగా, మిగిలిన వారంతా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులే. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రంలోని కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇంతవరకూ ఆ హామీ నెరవేర్చలేదు. పైగా యూజీడీ, మలేరియా, నీటి సరఫరా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు హెల్త్ అలవెన్సులు ఇవ్వాలన్న డిమాండ్‌ను కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు ఈనెల 26 నుంచి సమ్మెబాట పట్టారు. అప్పటికి రెండు రోజులు ముందు ప్రభుత్వ సెలవు దినాలు (ఆదివారం, సోమవారం క్రిస్మస్) కావడంతో పారిశుధ్య కార్మికులు విధులకు హాజరుకాలేదు. తర్వాత సమ్మెకు దిగడంతో ఆరు రోజులుగా పారిశుధ్య నిర్వహణ పనులు నిలిచిపోయాయి. ఇంటింటికీ క్లాప్ వాహనాలు వెళ్లకపోవడంతో ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను తెచ్చి రోడ్లపై పారబోస్తున్నారు. అలాగే మార్కెట్లు, వాణిజ్య ప్రాంతాల్లో రోడ్డుపక్కనే ఏర్పాటుచేసిన డంపర్‌బిన్లను కూడా యార్డుకు తరలించేందుకు అవకాశం లేకుండాపోయింది. దీంతో చెత్తకుప్పలుగా పేరుకుపోయింది. నగరంలో ఏ రోడ్డులో చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి చెత్త తరలించకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఆ మార్గంలో ప్రయాణించేవారు, చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమల వ్యాప్తి పెరిగిపోతోంది. వారం రోజులుగా చెత్త తరలించకపోవడంతో రోజురోజుకీ పరిస్థితి దిగజారుతోంది. మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే మాత్రం ప్రజలు రోగాల బారినపడడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా చెత్త తరలింపునకు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.