బటన్‌ నొక్కేశారు సరే... డబ్బులేవి!?

ABN , First Publish Date - 2023-03-26T01:35:28+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఐదు రోజుల కిందట బటన్‌ నొక్కి ‘విద్యా దీవెన’ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు.

బటన్‌ నొక్కేశారు సరే... డబ్బులేవి!?

విద్యా దీవెనకు ఈ నెల 19వ తేదీన బటన్‌ నొక్కిన ముఖ్యమంత్రి

జిల్లాలో 44,712 మంది విద్యార్థులకు రూ.34.4 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటన

ఐదారు రోజులైనా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ కాని డబ్బులు

వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

కళాశాలలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు

తమకేమీ తెలియదనే సమాధానాలు

ప్రతిసారీ ఇబ్బందులు పడుతున్నామంటున్న తల్లిదండ్రులు

గతంలో మాదిరిగా కళాశాలలకు నేరుగా చెల్లించడమే మంచిదనే అభిప్రాయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఐదు రోజుల కిందట బటన్‌ నొక్కి ‘విద్యా దీవెన’ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అండగా ఉంటోందన్నారు. అయితే జిల్లాలో వేలాది మంది విద్యార్థులకు శనివారం వరకూ డబ్బులు జమ కాలేదు. కళాశాలలకు వెళ్లి ఆరా తీస్తే తమకు తెలియదని చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ‘విద్యా దీవెన’ విషయంలో ప్రతిసారి ఇదే సమస్య తలెత్తుతోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన ప్రతిసారీ కళాశాల యాజమాన్యాలు...ఫీజులు చెల్లించాలని కోరుతుంటాయని, కానీ ఇక్కడ చూస్తే ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.

గత ఏడాది మూడో క్వార్టర్‌ ఫీజు

‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద డిప్లమో, డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులను చెల్లిస్తోంది. వీటిని నేరుగా సదరు విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని తల్లిదండ్రులు కళాశాలలకు చెల్లించాల్సి ఉంటుంది. 2022-23 విద్యా సంవత్సరం అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన ‘విద్యా దీవెన’ డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ నెల 20న సీఎం జగన్మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కారు. విశాఖ జిల్లాలో డిప్లొమో, ఇంజనీరింగ్‌, డిగ్రీ చదువుతున్న 44,712 మంది విద్యార్థులకు రూ.34.4 కోట్లు విడుదల చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, జిల్లాలో ఐదారు వేల మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని తెలిసింది. వీరంతా ప్రస్తుతం కళాశాలలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

విద్యార్థుల ఆందోళన

కళాశాలలో అడిగితే అక్కడ సమస్య లేదని చెబుతున్నారని, బ్యాంకులో అడిగితే డబ్బులు జమ కాలేదని చెబుతున్నారని, ఏం చేయాలో అర్థం కావడం లేదని డిప్లొమో చదువుతున్న శివకృష్ణ అనే విద్యార్థి వాపోయాడు. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న రామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన శ్రీదివ్య మాట్లాడుతూ విద్యా దీవెన కోసం బ్యాంకుకు వెళితే అకౌంట్‌లో డబ్బు జమ కాలేదని చెప్పారని, కాలేజీలో అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. ఫీజులను గతంలో మాదిరిగా కాలేజీలకే నేరుగా చెల్లిస్తే ఈ ఇబ్బందులు ఉండేవి కావని డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్న కృష్ణకాంత్‌ వాపోయాడు. విద్యాదీవెన పడిన ప్రతిసారి బ్యాంకులు, కాలేజీలు, అధికారుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పాడు. కాలేజీలకు ఫీజులు చెల్లించకుండా అమ్మ అకౌంట్‌లో జమ చేయడం వల్ల ఉపయోగం కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయని, ఫీజులు పడని ప్రతిసారి కాలేజీల నుంచి ఒత్తిడి పెరుగుతోందని జ్యోత్స్న అనే విద్యార్థిని ఆవేదన వ్యక్తంచేసింది. పిల్లలతోపాటు తమకు ఇబ్బందులు తప్పడం లేదని, దీనివల్ల ఒత్తిడికి గురికావడం తప్ప మరో ప్రయోజనం ఉండడం లేదని రాజేష్‌ అనే విద్యార్థి తండ్రి నాగరాజు పేర్కొన్నారు. విద్యా దీవెన పడినట్టు ప్రభుత్వం ప్రకటించడమే తరువాయి...కాలేజీలు ఫీజులు చెల్లించాలంటూ అడుగుతున్నాయని, పడలేదంటే వాళ్లు అంగీకరించడం లేదని మరో విద్యార్థి తండ్రి వాపోయాడు. ప్రభుత్వం తెచ్చిన ఈ విధానం వల్ల లాభం కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయని పలువురు వాపోతున్నారు.

790 మంది విద్యార్థుల పెండింగ్‌..

జిల్లాలో బయోమెట్రిక్‌ సమస్య వల్ల 790 మంది విద్యార్థులకు విద్యా దీవెన పెండింగ్‌లో ఉండిపోయిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నామని, ఆయా విద్యార్థులకు సమాచారాన్ని అందించామని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రమణమూర్తి తెలిపారు. మూడో క్వార్టర్‌కు సంబంధించిన డబ్బులు జమ కావడంలో కొంత ఆలస్యమవుతోందని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ నెల 27లోగా డబ్బులు జమ అయ్యేలా చూస్తున్నామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాలేజీల నుంచి ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

Updated Date - 2023-03-26T01:35:28+05:30 IST