ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉన్నాయి...
ABN , First Publish Date - 2023-05-26T01:42:20+05:30 IST
‘నాకు ఉన్నతాధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి.

నేనేం చేసినా అడగరు
ఈస్ట్ సబ్‌డివిజన్‌లోని వివాదాస్పద క్రైమ్ ఎస్‌ఐ వ్యాఖ్యలు
విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):
‘నాకు ఉన్నతాధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. నేనేం చేసినా అడగరు. పైగా మద్దతుగా నిలబడతారు’...ఇదీ ఈస్ట్ సబ్ డివిజన్‌లోని వివాదాస్పద క్రైమ్ ఎస్‌ఐ ధీమా. ఈస్ట్ సబ్‌డివిజన్‌లోని కీలక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న క్రైమ్ ఎస్‌ఐకు వివాదాస్పద అధికారి అనే ముద్ర ఉంది. ఇటీవల సదరు అధికారి ఒక డీసీ షీట్ కలిగిన యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ వ్యవహారంపై ‘రెచ్చిపోతున్న ఖాకీ’ శీర్షికన ఈనెల 24న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇది పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారి దందాలు, ఓవరాక్షన్‌పై అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారని పోలీస్ శాఖలోని అధికారులు, సిబ్బంది భావించారు. అయితే ‘ఆంధ్రజ్యోతి’తోపాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలను సదరు అధికారి ప్రస్తావిస్తూ ‘నాపై ఎన్ని వార్తలు వచ్చినా నాకు ఏమీ కాదు. సెబ్‌లో ఉన్నప్పుడు కూడా ఎంతోమందిని తప్పించేశాను. అయినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా ఒక డీసీ షీట్ కలిగిన యువకుడిని చావబాదాను. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అయినా కనీసం ఇంతవరకూ దీనిపై నన్ను వివరణ కోరలేదు. పైగా అధికారులంతా మద్దతుగా నిలిచారు’ అని చెప్పడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని తోటి అధికారులు చెబుతున్నారు. ఒక ఎస్‌ఐ ఇంతలా రెచ్చిపోతుంటే ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన వద్ద పనిచేసే కొందరు సిబ్బందే ప్రశ్నిస్తున్నారు. స్టేషన్‌లో యూనిఫారం వేసుకోలేదని, టోపీ పెట్టుకోలేదని...చిన్నపాటి కారణాలకే కిందిస్థాయి సిబ్బందిని వీఆర్‌కు సరండర్ చేసే అధికారులకు, సదరు ఎస్‌ఐ ఓవరాక్షన్ కనిపించకపోవడం విచిత్రంగా వుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.