ఉరి వేసుకుని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-08-02T00:24:34+05:30 IST
ఫ్యాన్‌కు ఉరి వేసుకుని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోపాలపట్నం సమీపంలోని చంద్రనగర్‌లో చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గోపాలపట్నం, ఆగస్టు 1: ఫ్యాన్‌కు ఉరి వేసుకుని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోపాలపట్నం సమీపంలోని చంద్రనగర్‌లో చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చంద్రనగర్ ట్రాన్స్‌ఫార్మర్ వీధికి చెందిన వాడాడ సంతోశ్‌కుమార్ కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. ఆయన వృత్తి రీత్యా మహారాష్ట్రలో వుండడంతో ఆయన భార్య రేణుక, కుమారుడు సూరజ్, కుమార్తె రియాలు సంతోష్‌కుమార్ తల్లిదండ్రులైన విశ్వేశ్వరరావు, ప్రభావతితో కలిసి చంద్రనగర్‌లో ఉంటున్నారు. గత నెలలో రేణుక మహారాష్ట్రలో వుంటున్న భర్త వద్దకు వెళ్లగా, పిల్లలు తాతయ్య, నాన్నమ్మల వద్ద ఉంటున్నారు. కాగా సూరజ్ (15) వేపగుంటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. నాలుగు రోజుల నుంచి అనారోగ్యంగా వుండటంతో సూరజ్ పాఠశాలకు వెళ్లడం లేదు. మంగళవారం ఉదయం ఆరున్నరకు సూరజ్ స్కూల్‌కు వెళతానని తాతయ్యకు చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అయితే ఎంతసేపటికీ గదిలోనుంచి బయటకు రాకపోవడంతో ఎనిమిది గంటలప్పుడు స్థానికుల సాయంతో గది తలుపులు పగులగొట్టి చూడగా సూరజ్ సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే సూరజ్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అయితే సూరజ్ ఏ కారణం చేత ఆత్మహత్యకు పాల్పడ్డాడో తెలియరాలేదు. సీఐ ఈదుల నరసింహారావు ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.