ఆక్రమణల కూల్చివేతకు తాత్కాలికంగా బ్రేకులు!
ABN , First Publish Date - 2023-05-27T00:56:56+05:30 IST
జిల్లా కేంద్రం పాడేరులో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా గురువారం ప్రారంభించిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియ రెండో రోజైనా శుక్రవారం కూడా కొనసాగింది. అయితే ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వర్తక సంఘం ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి, దుకాణాల తొలగింపునకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన మూడు రోజుల్లో ఆక్రమణలను స్వచ్ఛందగా తొలగించుకోవాలని, అప్పటి వరకు కూల్చివేతలు నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసిన వర్తక సంఘం ప్రతినిధులు
దుకాణాల తొలగింపునకు కొంత గడువు ఇవ్వాలని వినతి
మూడు రోజుల్లో స్వచ్ఛందంగా తీసేయాలని కలెక్టర్ విస్పష్టం
పాడేరు, మే 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరులో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా గురువారం ప్రారంభించిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియ రెండో రోజైనా శుక్రవారం కూడా కొనసాగింది. అయితే ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వర్తక సంఘం ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి, దుకాణాల తొలగింపునకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన మూడు రోజుల్లో ఆక్రమణలను స్వచ్ఛందగా తొలగించుకోవాలని, అప్పటి వరకు కూల్చివేతలు నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు.
అంబేడ్కర్ కూడలికి నలువైపులా, అక్కడి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గంలో సినిమాహాల్ సెంటర్ వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా వున్న ఆక్రమణలను గురువారం తొలగించిన విషయం తెలిసిందే. శుక్రవారం అక్కడి సినిమాహాల్ సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గంలోని ఇరువైపులా ఆక్రమణలను రెండు పెద్ద ఎక్సకవేటర్లు, ఒక చిన్న ఎక్సకవేటర్ సాయంతో తొలగించారు. శనివారం పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్లే మెయిన్‌రోడ్డులో మురుగు కాల్వలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు. రెండు రోజుల్లో మెయిన్ రోడ్లకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. అయితే ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వర్తక సంఘం ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిశారు. దుకాణాల తొలగింపునకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్, మూడు రోజుల్లో ఆక్రమణలను స్వచ్ఛందగా తొలగించుకోవాలని, లేకుంటే 30వ తేదీ నుంచి అధికార యంత్రాంగమే కూల్చివేస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు వర్తకులు అంగీకరించారు.