నిరసన హారు
ABN , First Publish Date - 2023-09-20T01:14:39+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయడు అరెస్టును నిరసిస్తూ, ఆయన జైలు నుంచి విడుదల కావాలని కోరుకుంటూ మంగళవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు, ప్రదర్శనలు, పూజలు కొనసాగాయి.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనలు
నియోజకవర్గాల్లో దీక్షలు, పూజలు
పార్టీ కార్యాలయం వద్ద సంతకాల సేకరణ
‘తూర్పు’లో మహిళల ర్యాలీ
సింహగిరిపై పూజల నిర్వహణకు బయలుదేరిన పార్టీ నేతలను అడ్డుకున్న పోలీసులు
బండారు సహా పలువురి అరెస్టు
కోర్టు వద్ద న్యాయవాదుల ధర్నా
విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయడు అరెస్టును నిరసిస్తూ, ఆయన జైలు నుంచి విడుదల కావాలని కోరుకుంటూ మంగళవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు, ప్రదర్శనలు, పూజలు కొనసాగాయి. సింహాచలంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరావు, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులను కొండ దిగువనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దేవాలయాలు, మసీదుల వద్ద 144 సెక్షన్ ఉందంటూ అరెస్టు చేయడం ఏమిటంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ నగర కార్యాలయంలో దీక్షలు నిర్వహించారు. పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ‘పశ్చిమ’ ఎమ్మెల్యే పెతంకశెట్టి గణబాబు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, దువ్వారపు రామారావు, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మద్దతుగా బ్యానర్‌పై సంతకాలను సేకరించారు. అలాగే, కార్యాలయ ఆవరణలో తెలుగు మహిళలు నల్ల చీరలు కట్టుకుని, ఐయామ్ విత్ బాబు ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కడిగిన ముత్యంలా చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటకు వస్తారన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ జగన్ తాను తీసుకున్న గోతిలో తానే పడబోతున్నాడన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఒక ముద్దాయి పరిపాలిస్తున్నాడని విమర్శించారు. భీమిలి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో, పెందుర్తిలోని పార్టీ కార్యాలయంలో తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనుయాదవ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. మోకాళ్లపై కూర్చుని అర్ధనగ్న ప్రదర్శనతో నిరసనను తెలియజేశారు. అనంతరం పెందుర్తి కూడలి ర్యాలీ నిర్వహించారు. ‘సైకో పోవాలి...సైకిల్ రావాలి’ అంటూ నినాదాలు చేశారు. అలాగే, తూర్పు నియోజకవర్గ పరిధిలోనూ నిరసనలు కొనసాగాయి. తెలుగుదేశం సానుభూతిపరులైన మహిళలు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సతీమణి సుజన ఆధ్వర్యంలో పెదవాల్తేరులో గల శ్రీకరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి విశాఖ ఐ హాస్పిటల్, ఉషోదయ జంక్షన్ మీదుగా ఎంవీపీలోని ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దీక్ష శిబిరంలో కూర్చున్న ఎమ్మెల్యేకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుకు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చోడే పద్మజ, లక్ష్మి, శ్రీలక్ష్మి, హేమ, గిరిజ, మాధవీలత, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విశాఖలో న్యాయవాదులు రోడ్డెక్కి నిరసనను తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు ‘మేము సైతం బాబు కోసం’ అంటూ బ్యానర్‌ను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పీఎస్ నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.