సీఎం హామీలు మాటలకే పరిమితం
ABN , First Publish Date - 2023-01-18T00:21:06+05:30 IST
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని, , పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు ఆరోపించారు.
అనకాపల్లి అర్బన్, జనవరి 17 : ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని, , పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12,500 ఇస్తామని చెప్పి రూ. 7,500లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. అలాగే 65లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయాల్సి ఉండగా, రకరకాల ఆంక్షలు విధించి ఆ సంఖ్యను 45 లక్షలకు కుదించారని పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాలు వట్టిమాటలయ్యాయని, డ్రిప్ పరికరాలకు సబ్సిడీ ఇవ్వలేదని, వైఎస్‌ఆర్ జలకళ పేరుతో వేస్తామన్న బోర్లు ప్రచారానికే పరిమితమయ్యాయని విమర్శించారు. విద్యుత్ మోటర్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి సకాలంలో డబ్బులు చెల్లించకుండా చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. అలాగే మండల కేంద్రంలో శీతల గిడ్డంగులు నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఇలా అనేక హామీలు పెండింగ్‌లో ఉండగా, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98.5 శాతం పూర్తి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలను నెరవేర్చాలని బుద్ద డిమాండ్ చేశారు.