ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , First Publish Date - 2023-06-11T00:11:43+05:30 IST
సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకుండా జగన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.
అనకాపల్లి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి):సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకుండా జగన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సీపీఎస్ స్థానంలో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఈ హామీ నెరవేర్చకపోవడంతో మూడు లక్షల మంది ఉద్యోగులు నిరాశకు గురయ్యారన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నాలుగేళ్ల తర్వాత ఉద్యోగులను మభ్యపెట్టేవిధంగా జీపీఎస్ స్కీమ్‌ను అమలు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి ఇప్పుడు 2014 జూన్ నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారినే రెగ్యులర్ చేస్తామని మాట మార్చారన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.7వేల కోట్లు పీఆర్‌సీ, డీఏ బకాయిలను నాలుగు విడతల్లో చెల్లిస్తామని చెప్పడం ఉట్టికేగనమ్మ స్వర్గానికి ఏగినట్టు ఉందని జగదీశ్వరరావు ఎద్దేవా చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నీ తక్షణమే సెటిల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో విశ్రాంత ఉపాధ్యాయుల సంఘ కార్యదర్శి బుద్ద కాశీవిశ్వేశ్వరరావు, కాండ్రేగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.