గ్లోసైన్‌ బోర్డులపై ప(క)న్ను

ABN , First Publish Date - 2023-04-03T00:13:22+05:30 IST

నగర వాసుల నుంచి ఆస్తిపన్ను, చెత్తపన్ను వసూలులో కఠినంగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ అధికారులు తాజాగా దుకాణదారులపై పడ్డారు.

గ్లోసైన్‌ బోర్డులపై ప(క)న్ను

వార్డు సచివాలయాల వారీగా సర్వే

చదరపు మీటర్‌ యూనిట్‌గా పన్ను విధింపు

దుకాణదారులకు డిమాండ్‌ నోటీసులు జారీ

పన్ను చెల్లించకపోతే బోర్డుల జప్తు

సీతమ్మధారలో మందుల దుకాణం బోర్డు తొలగింపు

అధికారుల తీరుపై వ్యాపారవర్గాల్లో ఆందోళన

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగర వాసుల నుంచి ఆస్తిపన్ను, చెత్తపన్ను వసూలులో కఠినంగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ అధికారులు తాజాగా దుకాణదారులపై పడ్డారు. షాపుల ముందు ఏర్పాటు చేసిన గ్లోసైన్‌ బోర్డు (డిస్ప్లే డివైస్‌)లకు ప్రకటనల కేటగిరీలో పన్ను చెల్లించాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే పలువురు దుకాణదారులు, వ్యాపార సంస్థలకు డిమాండ్‌ నోటీసులు జారీచేశారు. సకాలంలో పన్ను చెల్లించకుంటే యంత్రాలతో బోర్డులను తొలగించి తీసుకుపోతున్నారు. దీంతో వ్యాపారవర్గాల్లో ఆందోళన నెలకొంది.

రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల పరిధిలో గ్లోసైన్‌ బోర్డులు, దుకాణాల ఎదుట ఏర్పాటుచేసే ప్రకటనల బోర్డులకు ప్రకటనల కేటగిరీలో పన్ను విధిస్తారు. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 685 ప్రకారం తమ పరిధిలోని దుకాణాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, వ్యాపార, వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు ముందు బోర్డులను ఏర్పాటుచేస్తే వాటిపై పన్ను వసూలుచేసే అధికారం స్థానిక సంస్థకు ఉంది. నాన్‌ ఏజెన్సీ కేటగిరీలో వ్యాపారులు సొంతంగా ఏర్పాటు చేసుకునే బోర్డుల నుంచి స్థానిక సంస్థలే పన్ను వసూలు చేస్తాయి. అదే ఏజెన్సీలకు చెందిన హోర్డింగ్‌లు, బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధిస్తుంది. నాన్‌ ఏజెన్సీ కేటగిరీలో దుకాణాలు/వ్యాపార సంస్థల ముందు భాగంలో ఇల్యూమినేషన్‌ బోర్డు (పగలు, రాత్రి స్పష్టంగా కనిపించేవి), పగటిపూట మాత్రమే కనిపించే నాన్‌ ఇల్యూమినేషన్‌ బోర్డు, ఫ్లెక్సీలు, పెయింట్‌లతో ఉన్న బోర్డులకు ఒక్కో రీతిలో పన్ను లెక్కిస్తారు.

గ్రేటర్‌ విశాఖ ఎనిమిది జోన్ల పరిధిలోని దుకాణాలు, హోటళ్లు, బార్‌లు, లాడ్జిలు, ఆస్పత్రులు, ఇతర కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసుకునే బోర్డులు (డిస్ప్లే డివైస్‌) నుంచి ఏటా రూ.ఐదు కోట్ల వరకూ పన్ను వసూలు కావాల్సి ఉంది. ఈ బాధ్యత టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి అప్పగించారు. అయితే వారు దీనిపై ఉదాశీనంగా వ్యవహరిస్తుండడంతో బకాయిలు పేరుకుపోయాయి. మొక్కుబడిగా డిమాండ్‌ నోటీసులు జారీచేసి చేతులు దులిపేసుకునేవారు.

తాజాగా ఈ పరిస్థితి మారింది. దుకాణాలు/వ్యాపార సంస్థల నుంచి డిస్ప్లే డివైస్‌ పన్ను శతశాతం వసూలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని ఆదేశించారు. వార్డు సచివాలయాల వారీగా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో లెక్కించి, వాటికి కొలతలు వేసి వివరాలను అందజేయాలని అన్ని జోన్‌ల ఏసీపీలు వార్డు సచివాలయం ఎనిమినిటీస్‌ సెక్రటరీలను ఆదేశించారు. ఈ మేరకు వార్డు సచివాలయాల కార్యదర్శులు తమ పరిధిలోని బోర్డుల కొలతలు వేసి నివేదికలు అందజేశారు. అక్కడ కొలతల మేరకు పన్ను విధించి, యజమానులకు డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో సచివాలయ సిబ్బంది పన్ను చెల్లించాలంటూ దుకాణదారులపై ఒత్తిడి తెస్తున్నారు. మొండికేస్తున్న వారి దుకాణాల ముందు ఉన్న బోర్డులను యంత్రాల సహాయంతో తొలగిస్తున్నారు. తాజాగా సీతమ్మధారలోని ఒక మందుల దుకాణం ముందున్న గ్లోసైన్‌ బోర్డ్‌ను రెండు రోజుల కిందట టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది జేసీబీ సహాయంతో తొలగించడం వివాదాస్పదమైంది. 20 ఏళ్లుగా దుకాణం నడుపుతున్నామని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని దుకాణం యజమాని రంగనాథ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. మందుల దుకాణాలకు ప్రకటనల పన్నులో మినహాయింపు ఉంటుందని చెప్పినప్పటికీ బోర్డును తొలగించేశారని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు.

Updated Date - 2023-04-03T00:13:22+05:30 IST