Share News

డీజీపీ ఆదేశాల మేరకు నలుగురు పోలీసు సిబ్బంది సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2023-11-10T01:03:12+05:30 IST

పరవాడలోని సంతబయలు వద్ద ఈ నెల ఏడో తేదీన జరిగిన సంఘటనపై వేగంగా స్పందించి తగు చర్యలు తీసుకున్నామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని డీఐజీ హరికృష్ణ, ఎస్పీ మురళీకృష్ణ.. జిల్లా పోలీసులకు స్పష్టం చేశారు.

డీజీపీ ఆదేశాల మేరకు నలుగురు పోలీసు సిబ్బంది సస్పెన్షన్‌
విలేకరులతో మాట్లాడుతున్న డీఐజీ హరికృష్ణ, పక్కన ఎస్పీ మురళీకృష్ణ

పరవాడ సంఘటనపై సత్వర చర్యలు

రేంజ్‌ డీఐజీ హరికృష్ణ వెల్లడి

ఇటువంటివి పునరావృతం కాకూడదని పోలీసులకు విస్పష్టం

ఆర్మీ ఉద్యోగిపట్ల సిబ్బంది వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నాం: ఎస్పీ

అనకాపల్లి టౌన్‌, నవంబరు 9 : పరవాడలోని సంతబయలు వద్ద ఈ నెల ఏడో తేదీన జరిగిన సంఘటనపై వేగంగా స్పందించి తగు చర్యలు తీసుకున్నామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని డీఐజీ హరికృష్ణ, ఎస్పీ మురళీకృష్ణ.. జిల్లా పోలీసులకు స్పష్టం చేశారు. గురువారం స్థానిక పోలీస్‌ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడుతూ, పరవాడ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది డి.శోభ, ఎం.ముత్యాలనాయుడు కలిసి ఈ నెల 7వ తేదీన పోలీస్‌ యూనిఫారంలో పరవాడ సంతబయలు జంక్షన్‌లో ప్రజల మొబైల్‌ ఫోన్‌ల్లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారని చెప్పారు. ఈ సమయంలో ఇండియన్‌ ఆర్మీ 52వ బెటాలియన్‌ రాష్ట్రీయ రైఫిల్స్‌లో నాయక్‌గా పనిచేస్తున్న సయ్యద్‌ అలీముల్లా తన స్వగ్రామం ఎలమంచిలి మండలం రేగుపాలెం వెళ్లేందుకు బస్‌ కోసం వేచి ఉన్నారన్నారు. పోలీస్‌ సిబ్బంది అతని వద్దకు వెళ్లి మొబైల్‌ ఫోన్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పారన్నారు. ‘మీరు పోలీసులేనా? లేక నకిలీ పోలీసులా? ఐడీ కార్డు చూపించండి’అని అలీముల్లా అడగడంతో తాము ఐడీ కార్డులు వెంట తీసుకురాలేదని, పోలీస్‌స్టేషన్‌కు వస్తే ఐడీ కార్డులు చూపిస్తామని సిబ్బంది చెప్పారన్నారు. వెంటనే ఆర్మీ ఉద్యోగి తన ఐడీ కార్డును పోలీస్‌ సిబ్బందికి చూపిస్తూ, మీ ఐడీ కార్డులు చూపించమని కోరారన్నారు. ఇందుకు ఆగ్రహించిన పోలీస్‌ సిబ్బంది అతడ్ని స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అతను పెనుగులాడి తాను ఏ తప్పు చేయలేదని, పోలీస్‌స్టేషన్‌కు రానని ప్రతిఘటించారని చెప్పారు. అనంతరం కానిస్టేబుళ్లు శోభ, ఎం.ముత్యాలనాయుడు పరవాడ పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేయగా హెడ్‌ కానిస్టేబుల్‌ దేవళ్లు, కానిస్టేబుల్‌ రమేశ్‌ సంతబయలు వద్దకు చేరుకున్నారని, నలుగురూ కలిసి ఆర్మీ ఉద్యోగిని బలవంతంగా ఆటోలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారని డీఐజీ తెలిపారు. ఆర్మీ ఉద్యోగి బిగ్గరగా కేకలు వేస్తూ ప్రతిఘటించారని, స్థానికులు కొంతమంది తమ మొబైల్‌ ఫోన్లతో వీడియా తీశారని ఆయన వివరించారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ మురళీకృష్ణ స్పందించి ఆర్మీ ఉద్యోగిని అనకాపల్లి పిలిపించి వివరాలు తెలుసుకున్నారని, నలుగురు పోలీసు సిబ్బందిని ఏఆర్‌కు అటాచ్‌ చేశారన్నారు. ఈ సంఘటనపై చేపట్టిన చర్యల గురించి జిల్లా పోలీసు అధికారులు.. సయ్యద్‌ అలీముల్లా విధులు నిర్వహిస్తున్న సంబంధిత ఆర్మీ బెటాలియన్‌ అధికారులకు వివరించగా వారు సంతృప్తి చెందారని డీఐజీ చెప్పారు. అనంతరం పరవాడ సంఘటనపై మరింత లోతుగా విచారణ జరిపించి, సంబంధిత అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా డీజీపీ ఆదేశాల మేరకు నలుగురు పోలీస్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, ఆర్మీ ఉద్యోగిపట్ల పోలీస్‌ సిబ్బంది వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నామని అన్నారు.

Updated Date - 2023-11-10T01:03:13+05:30 IST