సీఐల బదిలీపై సస్పెన్స్‌

ABN , First Publish Date - 2023-06-11T01:21:38+05:30 IST

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీలపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

సీఐల బదిలీపై సస్పెన్స్‌

ఎన్నికల ఏడాది కావడంతో సమర్థులతో టీమ్‌ ఏర్పాటుకు సీపీ యోచన

అందుకు అనుగుణంగా జాబితా తయారీ

ఆ విషయం బయటకు పొక్కడంతో రాజకీయ ఒత్తిళ్లు

ప్రజా ప్రతినిధుల సిఫారసులతో కుదరని సమీకరణాలు

బదిలీలను తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టిన త్రివిక్రమవర్మ

నేడు వైవీ సుబ్బారెడ్డి రానుండడంతో బదిలీలపై మళ్లీ మొదలైన చర్చ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీలపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే గడువు ఉండడంతో సమర్థులైన వారితో టీమ్‌ను ఏర్పాటుచేసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమవర్మ భావించారు. అందుకు అనుగుణంగా ఒక జాబితాను కూడా సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో కొంతమంది సీఐలు కీలక పోస్టింగ్‌లు కోసం రాజకీయ నేతల ద్వారా ఒత్తిడి తేవడంతో బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆదివారం నగరానికి వస్తుండడంతో సీఐల బదిలీలపై మళ్లీ చర్చ మొదలైంది.

నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పరిధిలో సీఐ పోస్టింగ్‌కు పోటీ ఎక్కువగా ఉంటుంది. కీలకమైన స్టేషన్‌లో పోస్టింగ్‌ కోసం కొందరు, నగరంలో ఏదో ఒక చోట పోస్టింగ్‌ దక్కితే చాలని మరికొందరు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో తమకు పరిచయం ఉన్న అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధుల ద్వారా సీపీకి సిఫారసు చేయించుకుంటుంటారు.

ఇదిలావుండగా ఇటీవల సీపీగా బాధ్యతలు చేపట్టిన త్రివిక్రమవర్మ నగర పోలీసింగ్‌ తీరుతెన్నులపై నిశితంగా అధ్యయనం చేశారు. నగరంలో సమర్థంగా పనిచేయలేకపోతున్నారని, అవినీతి ఆరోపణలు కలిగిన వారిని నగరం నుంచి బయటకు పంపించేయాలని భావించారు. వారి స్థానంలో సమర్థులు, నిజాయితీపరులుగా గుర్తింపు కలిగిన వారిని రేంజ్‌ నుంచి తీసుకోవాలనుకున్నారు. దీనికి అనుగుణంగా నగరం నుంచి ముగ్గురు సీఐలను రేంజ్‌కు సరండర్‌ చేశారు. సరండర్‌ చేయాల్సిన మరికొందరిని కూడా గుర్తించారు. నగరం నుంచి సరండర్‌ చేసినవారి స్థానంలో సమర్థులను రేంజ్‌ నుంచి తీసుకునేందుకు తనకు తెలిసిన , నమ్మకస్తులైన అధికారుల నుంచి సమాచారం కూడా సేకరించారు. ఈ విధంగా ఒక జాబితాను తయారుచేసుకుని బదిలీలకు సమాయత్తమవుతున్న సమయంలో విషయం బయటకు పొక్కింది. దీంతో నగరంలో పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు నగరంలోనే పనిచేస్తున్నప్పటికీ కీలకమైన పోస్టింగ్‌లపై కన్నేసిన మరికొందరు అప్రమత్తమయ్యారు. తమకు తెలిసిన అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులను కలిసి పోస్టింగ్‌ కోసం సీపీపై ఒత్తిడి తీసుకువచ్చారు. అధికార పార్టీనేతలు, ప్రజా ప్రతినిధులు సూచించిన వారికి నగరంలో పోస్టింగ్‌ ఇస్తే వచ్చే ఎన్నికల్లో శాంతిభద్రతల నిర్వహణ కష్టమని సీపీ భావించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అటు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గలేక...అధికార పార్టీ నేతలను కాదని తాను సమర్థులని గుర్తించిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేక బదిలీల నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు పోలీస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటువంటి తరుణంలో వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం నగరానికి వస్తుండడంతో సీఐల బదిలీల అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. కీలక పోస్టింగ్‌లపై గురిపెట్టిన సీఐలు తమకు అనుకూలంగా ఉన్న నేతల ద్వారా సుబ్బారెడ్డిని కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో సీఐల బదిలీలపై కదలిక వస్తుందని పోలీస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - 2023-06-11T01:21:38+05:30 IST