ఠారెత్తించిన ఎండ

ABN , First Publish Date - 2023-06-02T23:51:03+05:30 IST

జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో శుక్రవారం భానుడు నిప్పులు చెరిగాడు. ఉదయం నుంచి ఉక్కపోత.. 11 గంటల తర్వాత వడగాడ్పులతో జనం అల్లాడిపోయారు.

 ఠారెత్తించిన ఎండ
జనసందడి లేని నెహ్రూచౌక్‌

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 2: జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో శుక్రవారం భానుడు నిప్పులు చెరిగాడు. ఉదయం నుంచి ఉక్కపోత.. 11 గంటల తర్వాత వడగాడ్పులతో జనం అల్లాడిపోయారు. పట్టణంలోని నెహ్రూచౌక్‌, చోడవరం బస్టాప్‌ రోడ్డు, రింగురోడ్డు, మార్కెట్‌యార్డు రోడ్డు, మెయిన్‌రోడ్డు ప్రాంతాలతోపాటు చిన్నపాటి వీధుల్లో జనసందడి లేకుండా వెలవెలబోయాయి. రోడ్లపై చిరువ్యాపారులు అవస్థలు పడ్డారు. శీతలపానీయాల దుకాణాలు రద్దీగా మారాయి. సాయంత్రం దాటినా ఉష్ణోగ్రతలో మార్పులు రాకపోవడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఫ్యాన్‌ కింద కూర్చొన్నా వేడిగాలులు వీస్తుండడంతో ఇబ్బందులు పడ్డారు. చల్లటి నీళ్లు లభ్యం కాక కొళాయిల నుంచి వచ్చే వేడినీటితోనే శరీరాలను పరిశుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కోటవురట్లలో..

రోజురోజూకు భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వడగాడ్పులతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాడు. మండల కేంద్రం నిప్పుల కొలిమిలా తయారైంది. జనం విలవిలలాడుతున్నారు. ఇల్లు వదిలి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచే సూర్యతాపం మొదలైంది. 11 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆ సమయాల్లో బస్సులు, ఆటోలు ఖాళీగా తిరిగాయి. శీతలపానీయాల దుకాణాలు మాత్రం కిటకిటలాడాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావడంలేదు. ఈ ఏడాదిలో భారీస్ధాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఎండలకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

సబ్బవరంలో..

భానుడి ఉగ్రరూపం దాల్చడంతో మండల ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం నుంచి ఎండ మండిపోవడంతో ప్రజలు రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. ఎండ వేడిమికి జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. శుక్రవారం ఎండ ధాటికి మండల కేంద్రంలోని రహదారులు జనాలు లేక వెలవెలబోయాయి. వృద్ధులు, చంటి పిల్లలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ వేడిమికి జనాలు జ్యూస్‌లు, కూల్‌డ్రింక్స్‌ తాగుతూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు.

పాయకరావుపేటలో..

భానుడు ప్రతాపానికి పాయకరావుపేట ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతోపాటు వేడిగాలులు బలంగా వీచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండలకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాన సెంటర్లన్నీ జనసంచారం లేక వెలవెలబోయాయి. ఉక్కపోతకు మహిళలు, పిల్లలు, వృద్ధులు ఆపసోపాలు పడ్డారు. బయటకు వచ్చినవారు వేడి తాపాన్ని తీర్చుకోవడానికి శీతల పానీయాల కేంద్రాల వద్ద క్యూ కట్టారు.

Updated Date - 2023-06-02T23:51:03+05:30 IST