భానుడి భగభగ
ABN , First Publish Date - 2023-06-07T01:15:40+05:30 IST
వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడంతో నగరం మంగళవారం నిప్పుల కుంపటిలా మారింది.
వాయువ్య గాలులతో నగరం ఉక్కిరిబిక్కిరి
ఎయిర్‌పోర్టులో 40 డిగ్రీలు నమోదు
విశాఖపట్నం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడంతో నగరం మంగళవారం నిప్పుల కుంపటిలా మారింది. ఉదయం పది గంటల వరకు పాక్షికంగా మేఘాలు ఆవరించాయి. ఆ తరువాత క్రమేపీ ఎండ తీవ్రత పెరిగింది. ఎండకు ఉక్కపోత తోడైంది. రాత్రి పది గంటల సమయంలో కూడా నగరంలో వేడి వాతావరణం కొనసాగింది. ఎయిర్‌పోర్టులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికం. పొడిగాలుల ప్రభావంతో ఉక్కపోత ఎక్కువగా వుందని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. దీనికితోడు వాయువ్య భారతం నుంచి వీచే గాలుల్లో తేమశాతం తక్కువగా ఉండడంతో వాతావరణం వేడెక్కిందన్నారు. బుధవారం నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని పేర్కొంది.